ప్రశాంత్ కిశోర్.. ఉరఫ్ పీకే.. రాజకీయ వ్యూహకర్తగా ఆయన పలు సందర్భాల్లో సఫలమయ్యారు. కానీ.. రాజకీయ నేతగా మాత్రం ఆయన విఫలమయ్యారనే చెప్పాలి. ఎందుకంటే.. రాజకీయ వ్యూహకర్త నుంచి ఆయన రాజకీయ నేతగా ఆవిర్భవించారు. కానీ.. రాజకీయంగా ఆయన శకునం చెప్పే బల్లి సామెతను తలపించారు. తాజాగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బోణీ కొట్టలేకపోయారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసంలోకనీసం 10 స్థానాలైనా దక్కించుకుంటానని చివరి నిమిషంలో పెట్టుకున్న ఆశలు కూడా ఫలించలేదు.
వాస్తవానికి ఏడాది కిందటే జన్ సురాజ్ పార్టీ పేరుతో పీకే సొంత కుంపటి పెట్టుకున్నారు. చదువరులను పార్టీలో చేర్చుకున్నారు. మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లను కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఇదేసమయంలో పాదయాత్ర చేశారు. పేదల పక్షాన నిలుస్తానని చెప్పారు. ఇదే సమయంలో ఎవరూ ఊహించని హామీలుకూడా ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే.. మద్య నిషేధం తీసేస్తామన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ.. బీహారీలు పీకేను విశ్వసించకపోవడం గమనార్హం. మొత్తం 148 స్థానాల్లో ఒంటరిగానే పోరు చేసిన పీకే.. ఒక్క చోట కూడా గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు.
అంతేకాదు.. ఒక్క స్థానంలోనూ .. ఆయన బలమైన పోటీ కూడా ఇవ్వలేక పోవడం.. మరో విశేషం. కానీ, చిత్రం ఏంటంటే.. ఆయన సలహాలు ఇచ్చిన పార్టీలు.. పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాయి. సో.. దీనిని బట్టి ఆయన సొంతగా పోటీ చేస్తే.. మాత్రం విఫలం కావడం గమనార్హం. అయితే.. రాజకీయాల్లో ఏదీ ఊరికేనే రాదు.. జరగదు కదా.. అలానే.. పీకే కూడా వ్యూహాత్మకంగానే రాజకీయాల్లోకి వచ్చారన్న చర్చ ఉండడం ప్రస్తావనార్హం. ఆది నుంచి బీజేపీకి అనుకూలంగా ఉన్న పీకే.. బీహార్‌లో ఉద్దేశపూర్వకంగానే పార్టీ పెట్టారన్న చర్చ ఉంది.
కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంకును చీల్చడం ద్వారా.. కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలను అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఆయన చక్రం తిప్పారన్న వాదన గతం నుంచి వినిపించింది. అందుకే.. పీకే ఎవరితోనూ పొత్తు లేకుండా పోటీ చేస్తున్నట్టు చెప్పారు. కాగా.. తాజాగా వచ్చిన ఫలితాలను గమనించినా.. పీకే పార్టీ జన్‌సురాజ్ పోటీ చేసిన 148 స్థానాల్లో.. పూర్వాంచల్, ఉత్తరాంచల్ ఉన్నాయి. వీటిలోనే కాంగ్రెస్‌నేతృత్వంలోని మహాఘఠ్ బంధన్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందన్న వాదన పరిశీలకుల నుంచి వినిపిస్తోంది.