hyderabadupdates.com movies పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు, హైకోర్టు ఏం చెప్పింది?

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు, హైకోర్టు ఏం చెప్పింది?

దాదాపు 10 మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌న‌ర్‌ షిప్(పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది రాజకీయ దుమారానికి దారితీసింది. వైసీపీ హయాంలో మొత్తం 17 కాలేజీలు తీసుకురాగా.. వీటిలో ఐదు కాలేజీలు కొంతవరకు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మరో రెండు కాలేజీలు నిర్వహణలో ఉన్నాయి. ఈ నేపద్యంలో మిగిలిన పది కాలేజీలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని పేర్కొంది. ఇంత సొమ్ము పెట్టి నిర్మాణం చేసినా నిర్వహణ విషయంలో ఆశించిన మేరకు ఫలితం ఉండదని చెబుతోంది.

కాబట్టి వీటిని పీపీపీ విధానంలో ఇవ్వాలని జీవో కూడా జారీ చేసింది. గత రెండు నెలలుగా ఈ విషయంపై వివాదం కొనసాగుతున్న క్రమంలో రాష్ట్ర హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై ఇప్పటికే ఒకసారి విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా బుధవారం జరిగిన విచారణలో కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పీపీపీ అనేది చట్టవిరుద్ధం కాదని, ఇది విధానపరమైన నిర్ణయం అని పేర్కొంది. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి అడ్డుపడబోమని స్పష్టం చేసింది. అంతేకాదు ఒకవేళ ఈ విధానంలో ఏమైనా అవకతవకలు జరిగితే అప్పుడు జోక్యం చేసుకుంటాం.. తప్ప విధానపరమైన నిర్ణయాలను ఎట్టి పరిస్థితులలోనూ అడ్డుకోబోమని స్పష్టం చేసింది.

అంతేకాదు ఇదే సమయంలో “మీరు ఎప్పుడు టెండర్లు పిలుస్తున్నారు“ అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిని కూడా ప్రశ్నించింది. టెండర్లు నిర్వహించుకోవచ్చు అని, అయితే లాటరీ విధానంలో మాత్రం కోర్టు ఇచ్చే తీర్పు మేరకు అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గతంలోనూ టెండ‌ర్ల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని రాష్ట్ర హైకోర్టు చెప్పడం గమనార్హం. ఇప్పుడు మరోసారి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పచ్చ జెండా ఊపడంతో ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఇప్పటికే మార్కాపురం సహా పలు వైద్య కళాశాలల‌ను పీపీపీ విధానంలో అప్పగించేందుకు టెండర్లు పిలిచారు. కానీ, కోర్టులో పిల్ నేప‌థ్యంలో దీనిపై తాత్సారం జ‌రుగుతోంది. అయితే.. తాజా తీర్పుతో ఇక‌, ప్ర‌భుత్వం ర‌య్ ర‌య్ మంటూ ఈ విష‌యంలో ముందుకు సాగేందుకు అవ‌కాశం ఉంటుంది.

Related Post

ఆయనను బీఆర్ఎస్ నుండి త‌రిమేసి త‌ప్పు చేశారు: క‌వితఆయనను బీఆర్ఎస్ నుండి త‌రిమేసి త‌ప్పు చేశారు: క‌విత

బీఆర్ఎస్ పార్టీపైనా .. ఆ పార్టీ నేత‌ల‌పైనా విమ‌ర్శ‌లు చేస్తున్న తెలంగాణ జాగృతి నాయ‌కురాలు, మాజీ ఎంపీ క‌విత తాజాగా మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ప్ర‌స్తుత కాంగ్రెస్ పార్టీ నేత‌, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును ఉద్దేశించి.. ఆమె చేసిన వ్యాఖ్య‌లు