విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేష్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. అంటే ఆయన ఆహార్యం, వేషం మారిపోతుందని కాదు.. ప్రపంచ స్థాయి నాయకులను, వివిధ దేశాలకు చెందిన అధికారులను , పారిశ్రామిక వేత్తలను నారా లోకేష్ స్వయంగా ఆహ్వానించనున్నారు. వారికి సంబంధించిన ప్రతి అంశాన్నీ ఆయనే పరిశీలించనున్నారు. అత్యంత దగ్గరగా వారితో వ్యవహరించనున్నారు. అంతేకాదు.. విందుల నుంచిభోజనాల వరకు కూడా నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు.
వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో లోకేష్ వేర్వేరుగా వరుసగా భేటీలు నిర్వహించనున్నారు. వీటి లో యాక్షన్ టెసా, బ్లూ జెట్ హెల్త్ కేర్, జేమ్స్ కూక్ యూనివర్శిటీ, డిక్సన్ టెక్ సంస్థలకు చెందిన ప్రతి నిధులతో మంత్రి లోకేష్ కీలక చర్చలు జరపనున్నారు. అలాగే.. ఇన్వెస్టర్స్ ప్రాస్పెక్టివ్ ఆన్ గ్రోత్, ఆపర్చు నిటీ అండ్ ఎనేబుల్మెంట్ అనే అంశంపై జరిగే సెషన్లో లోకేష్ పాల్గొననున్నారు. ఆ తర్వాత సింగపూర్ దేశానికి చెందిన నేషనల్ సెక్యూర్టీ మంత్రి షణ్ముగం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో విడివిడిగా భేటీ కానున్నారు.
ఇక, విజయవాడ నుంచి సింగపూర్ విమాన సర్వీసులపై రాష్ట్ర ప్రభుత్వం-సింగపూర్ ప్రతినిధి బృందంతో చేసుకోనున్న ఒప్పంద కార్యక్రమానికి లోకేష్ హజరు కానున్నారు. ఆ తర్వాత మళ్లీ వివిధ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. సిలికాన్ జెన్ ఫ్యాబ్ ల్యాబ్, భారత్ బయోటెక్, కిర్లోస్కార్ గ్రూప్ వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత టూటైర్ సిటీల్లో ఐటీ, జీసీసీల విస్తరణపై జరిగే సమావేశానికి మంత్రి లోకేష్ హజరు కానున్నారు.
ఇలా నారా లోకేష్ వరుస భేటీలు, ఏర్పాట్లలో బిజీబిజీగా గడపనున్నారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరినీ పరిచయం చేసుకోవడంతోపాటు.. ఏపీకి సంబంధించిన అనేక సానుకూల అంశాలపై వారికి వివరించనున్నారు. ప్రతి విషయంపైనా తన ముద్ర వేయనున్నారు. నిజానికి ఇప్పటి వరకు చంద్రబాబు అన్నీ తానై చూసుకున్న కార్యక్రమాలు ఉన్నాయి. కానీ,తాజా సదస్సులో మాత్రం.. పూర్తిగా నారా లోకేష్ విశ్వరూపం చూపించేందుకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక, ఈ సదస్సులో మంత్రులు కూడా పాల్గొననున్నారు.