రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయమున్న రాజకీయ నేత, దివంగత వంగవీటి మోహన్ రంగా ఫ్యామిలీ నుంచి మహిళా నాయకురాలుగా ఆయన కుమార్తె ఆశా కిరణ్ తాజాగా రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరుతారు ఆమె వెనక ఎవరున్నారు అనే విషయాలు పక్కన పెడితే.. రంగా కుటుంబం నుంచి ఇప్పటివరకు ఇద్దరు నాయకులు ప్రజల్లోకి వచ్చారు. రంగా మరణానంతరం ఆయన సతీమణి వంగవీటి రత్నకుమారి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అప్పట్లో ఆమె విజయం కూడా దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత వంగవీటి రాధా రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఆ తర్వాత నుంచి అటు రత్నకుమారి ఇటు రాధా కూడా రాజకీయంగా విఫలం అవుతూనే ఉన్నారు. కొనాళ్లపాటు రత్నకుమారి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక, రాధా రాజకీయం కూడా అంత సజావుగా సాగలేదన్నది వాస్తవం. తొలుత ఆయన కాంగ్రెస్‌లో చేరి ఆ తర్వాత ప్రజారాజ్యం గూటికి చేరారు. తర్వాత మళ్లీ వైసీపీలోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన టిడిపిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలోనూ బలమైన నాయకుడుగా కానీ బలమైన వాయిస్ వినిపించే విషయం లో కానీ పెద్దగా ఉత్సాహంగా పనిచేయడం లేదన్న వాదన కనిపిస్తుంది. దీంతో అటు రత్నకుమారి ఇటు వంగవీటి రాధా కూడా రంగా స్థాయిని అందుకోలేకపోయారు అన్నది వాస్తవం. ఇప్పుడు రంగా కుమార్తెగా ఆశ బయటకు రావడం త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని చెప్పటం కాపు సామాజిక వర్గంలో ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఆవిడ మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు గమనించిన నెటిజన్‌లు, కాపు సామాజిక వర్గం నాయకులు అచ్చం రంగా మాదిరిగానే ఉన్నారని రంగా పోలికలతోనే ఉన్నారని వ్యాఖ్యానించడం మరో ఆసక్తికర విషయం.
ఇప్పటివరకు రంగా మరణించిన తర్వాత రత్నకుమారి, రాధా మాత్రమే ప్రజలకు పరిచయం ఉన్నారు. తొలిసారి ఆయన కుమార్తె బయటకు రావడం పైగా ఆమె రంగా పోలికలతోనే ఉన్నారన్న చర్చ జరగడం ఆసక్తికరమే. ఇదిలా ఉంటే పోలికలు ఎలా ఉన్నా, రంగా కుమార్తెగా, ఆయన వారసురాలిగా ఏ మేరకు ప్రజల్లో సక్సెస్ అవుతారు అనేది ముఖ్యం. ఇప్పటివరకు వచ్చిన ఇద్దరు ఆశించిన స్థాయిలో రాజకీయాలు చేయలేకపోయారు అన్నది ఒక చర్చ.
ఇప్పుడు రంగా వారసురాలిగా అరంగేట్రం చేస్తున్న ఆశ నిజంగానే రంగా స్థాయిని, పోనీ కనీసం సగంలో సగం అయినా ఆయన రేంజ్‌ను ఆమె చేరుకుంటారా అనేది కాలమే తేల్చాలి. పేదలకు బడుగు బలహీన వర్గాలకు కుల మతాలకు అతీతంగా రంగా అందించిన సేవలు ఈనాటికి ఉభయ గోదావరి జిల్లాలు సహా కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా అందరికీ తెలిసిందే. ఆ స్థాయిని అందుకోవాలంటే బలమైన వాయిస్ ఉండాలి. బలమైన మద్దతు కూడగట్టాలి. పేద ప్రజల్లో ముఖ్యంగా రంగ స్థాయిని అందుకునేలాగా వ్యవహరించాలి. మరి ఆశ ఏ మేరకు రంగా ఆశయాన్ని ఆశలను సాధిస్తారనేది చూడాలి.