రాజకీయంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ భిన్న ధృవాలు. పవన్ పార్టీ జనసేన..కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నాయి. ఏపీలో ఈ రెండు పార్టీలు అధికారం పంచుకుంటున్నాయి. పవన్ సనాతన ధర్మం కోసం బలంగా గళం వినిపిస్తున్నారు. ప్రకాష్ రాజ్‌కు బీజేపీ అంటే పడదు. పవన్ తీరును సైతం ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనసేనానిని టార్గెట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇద్దరి మధ్య రాజకీయంగా కొన్ని సందర్భాల్లో మాటల యుద్ధం కూడా సాగింది. ఈ పరిస్థితుల్లో ఇంతకుముందు వకీల్ సాబ్ సినిమాలో, ఇప్పుడు ఓజీ చిత్రంలో ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
రాజకీయంగా అంత ఘర్షణ పడుతూ.. సినిమా కోసం కలిసి పని చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఓజీ సక్సెస్ మీట్‌లో పవన్..ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ఓజీ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నాడు, మీకేం పర్వాలేదు కదా అని తనను అడిగారని.. తనకు ఏమాత్రం ఇబ్బంది లేదని చెప్పానని పవన్ వెల్లడించాడు. రాజకీయంగా తన అభిప్రాయాలు తనకు బలంగా ఉన్నాయని.. వాటిని నిర్మొహమాటంగా చెబుతానని.. అలాగే ప్రకాష్ రాజ్ అభిప్రాయాలు ప్రకాష్ రాజ్‌వి అని.. వాటిని తాను గౌరవిస్తానని పవన్ తెలిపాడు.
రాజకీయంగా తమ మధ్య వైరుధ్యం ఉన్నా.. అవి వ్యక్తిగత స్థాయికి రావని పవన్ పేర్కొన్నాడు. ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటుడని.. ఆయనతో కలిసి నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని… ఓజీ సినిమాలో ఆయన గొప్పగా నటించారని పవన్ అన్నాడు. ఐతే రాజకీయ అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ.. సినిమా సెట్లోకి మాత్రం వాటిని తీసుకురావొద్దని.. డిస్కషన్లు పెట్టొద్దని మాత్రం తాను టీంలోని వాళ్లకు స్పష్టం చేశానని పవన్ తెలిపాడు. తనకు సినిమా అంటే అమితమైన గౌరవమని.. దాని వల్లే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం వచ్చిందని.. సమాజంలో ఉన్న అసమానతలను తెరపై చూపించడానికి తనకు అవకాశమిచ్చింది సినిమానే అని.. అందుకే సినిమాపై తనకు ఎంతో ప్రేమాభిమానాలు, గౌరవం ఉన్నాయని పవన్ వ్యాఖ్యానించాడు.