ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులే కాదు.. న్యూట్రల్ సినీ అభిమానులు కూడా అతడి మీద ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. ఇదంతా గుండె లోతుల్లోంచి వచ్చిందే. ఇందులో పెయిడ్ ప్రమోషన్లు కనిపించవు. ఈ సమయంలో ప్రభాస్ ఎంత మంచి నటుడు.. తన స్టార్ పవర్ ఎలాంటిది.. తన సినిమాల రేంజ్ ఏంటి.. ఇలాంటి రెగ్యులర్ విషయాలను పక్కన పెట్టేద్దాం. వాటి గురించి అందరూ మాట్లాడతారు. వాటిని దాటి తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుందాం.
నిన్నా మొన్నా ఇండస్ట్రీలోకి వచ్చి ఒకట్రెండు హిట్లు పడగానే మిడిసిపడే హీరోలను చూస్తున్నాం. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పెరిగేకొద్దీ వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకుని బిల్డప్పులిచ్చే హీరోలనూ చూస్తున్నాం. కానీ దశాబ్దాలుగా సౌత్ ఇండియాలో తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతున్న రజినీకాంత్‌ను మించిపోయి.. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌ను ఏలుతున్న ఖాన్ త్రయాన్ని కూడా వెనక్కి నెట్టి.. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్‌గా అవతరించిన ప్రభాస్.. ఎప్పుడైనా కొంచెమైనా హద్దులు దాటి ప్రవర్తించడం.. అతిగా మాట్లాడ్డం.. లేదా తన కోసం సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్లు చేసుకోవడం.. చూశారా?
చిన్న చిన్న స్టార్లకు కూడా పేరు వెనుక బిరుదు వచ్చి చేరిపోతోంది. కొందరు హీరోలు పాత ట్యాగ్‌లు తీసేసి ఘనంగా ఉండే కొత్త ట్యాగ్స్ కూడా పెట్టుకుంటున్నారు. కానీ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్‌గా అవతరించిన ప్రభాస్‌కు మాత్రం ఎప్పుడూ ఏ ట్యాగ్ లేదు. కృష్ణంరాజు వారసుడు కాబట్టి ఆయన బిరుదైన ‘రెబల్ స్టార్’తో పిలుస్తున్నారు కానీ.. ప్రభాస్ మాత్రం సొంతంగా ఏ ట్యాగ్ పెట్టుకున్నది లేదు. ప్రభాస్ అనే పేరే ఒక బ్రాండ్. దానికి వేరే తోకలు అవసరం లేదు.
స్టార్ ఇమేజ్ సంపాదించాక జనాల్లోకి వచ్చి ఆ స్టేటస్‌ను ఆస్వాదించాలని.. తమ ఫాలోయింగ్ ఎలాంటిదో చూపించుకోవాలని ప్రతి స్టార్ హీరోకూ ఉంటుంది. తమ పాపులారిటీని చూసుకుని మురిసిపోవడం ఏ రంగంలోని వారికైనా అమితానందాన్నిస్తుంది. కానీ ప్రభాస్ మాత్రం ఇన్నేళ్ల కెరీర్లో అందుకోసం తాపత్రయ పడింది లేదు. ‘బాహుబలి’కి ముందు కూడా షో ఆఫ్ చేయలేదు. ‘బాహుబలి’తో బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగాక కూడా అతడిలో ఏ మార్పూ లేదు.
తన సినిమాలను ప్రమోట్ చేయాల్సిన సమయంలో అభిమానుల ముందుకు వచ్చి వాళ్లను డార్లింగ్స్ అంటూ ప్రేమగా సంబోధించి నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోవడం తప్పితే.. బిల్డప్పులివ్వడం అతడికి సాధ్యం కాని పని. ఇంత పెద్ద స్టార్‌గా అవతరించాక.. తాపీగా ఏడాదికో రెండేళ్లలో ఓ సినిమా చేసుకుంటూ రిలాక్స్ అవ్వొచ్చు. కానీ రెండేళ్ల వ్యవధిలో నాలుగు సినిమాలు చేసేలా కష్టపడడం, పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేయడం ప్రభాస్ రేంజ్ హీరోకు అంత సులువైన విషయం కాదు.
2023 చివర్లో సలార్ రిలీజ్ కాగా.. గత ఏడాది జూన్‌లో ‘కల్కి’ వచ్చింది. వచ్చే సంక్రాంతికి ‘రాజా సాబ్’ రాబోతుండగా.. దసరాకు ‘ఫౌజీ’తో పలకరించబోతున్నాడు ప్రభాస్. ఇంకా అతడి చేతిలో కల్కి-2, సలార్-2, స్పిరిట్ లాంటి క్రేజీ మూవీస్ ఉన్నాయి. ప్రభాస్ కోసం మరెన్ని సినిమాలు వెయిటింగ్‌లో ఉన్నాయి. కెరీర్లో ఈ దశలో ఇంత బిజీగా సినిమాలు చేస్తూ ప్రభాస్ తనే ఒక ఇండస్ట్రీగా మారాడంటే అతిశయోక్తి కాదు.
ప్రభాస్ నిర్మాతల మనిషి.. డైరెక్టర్స్ డిలైట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనతో పని చేసే ప్రతి టీం మెంబర్ ప్రభాస్‌తో ప్రేమలో పడిపోతాడు. ఇక అభిమానుల పట్ల ప్రభాస్ చూపించే ప్రేమ, అతడి సేవా భావం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన పెదనాన్న కార్యానికి వచ్చిన లక్షల మంది అభిమానులను కుటుంబ సభ్యుల్లా భావించి వాళ్లందరికీ కడుపు నిండా నాన్ వెజ్ ఫుడ్ పెట్టించిన ఘనత ప్రభాస్ సొంతం.
చూడ్డానికి చిన్న విషయంలా అనిపిస్తుంది కానీ.. ఇలా చేయడం అందరి వల్లా కాదు. ఇక ఏ ప్రకృతి విపత్తు తలెత్తినా.. ఏ మంచిపనికి ఇండస్ట్రీ తరఫున సాయం కావాాలన్నా ప్రభాస్ ఎంత ఉదారంగా స్పందిస్తాడో కూడా అందరికీ తెలుసు. అందుకే ప్రభాస్ ఎప్పుడూ తన పేరులోని ‘రాజు’ను వాడుకోకపోయినా.. అభిమానులు మాత్రం అతణ్ని రాజులానే చూస్తారు.