స్పిరిట్ ఆడియో టీజర్లో ప్రభాస్ ని ఇండియా సూపర్ స్టార్ అని సంబోధించడం, దానికి కౌంటర్ అన్నట్టు కింగ్ ప్రోమోలో దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్, షారుఖ్ ఖాన్ ని సూపర్ స్టార్ కంటే పెద్ద కింగ్ అని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టడం అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది. ఎవరు గొప్పంటే ఎవరు గొప్పని ఆయా ఫ్యాన్స్ వాదులాడుకుంటున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. నిజానికి ఈ పోలికే అర్థరహితం అని చెప్పాలి. ఎందుకంటే వయసు, అనుభవం రిత్యా షారుఖ్, ప్రభాస్ రెండు వేర్వేరు తరాలకు సంబంధించిన నట ప్రతినిధులు. వర్తమానంలో ఒకేసారి సినిమాలు చేస్తుండొచ్చు కానీ లెగసీ పరంగా ఇద్దరిది తలో దారి.
ఈ టాపిక్ మరింత బెటర్ గా అర్థం కావాలంటే కొంచెం వెనక్కు వెళ్ళాలి. 1983లో సినిమాలు మానేసి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక ఖైదీ రిలీజై చిరంజీవికి తిరుగులేని స్టార్ డం తెచ్చి పెట్టింది. తక్కువ కాలంలోనే మెగాస్టార్ గా నెంబర్ వన్ సింహాసనాన్ని అధీష్టించారు. అంత మాత్రాన ఎన్టీఆర్ కన్నా చిరు గొప్పని ఎవరూ అనరు. ఎందుకంటే జనరేషన్లు వేరు కాబట్టి. ఎన్టీఆర్ లాగా చిరంజీవి ఏనాడూ దర్శకత్వం చేయలేదు. చిరు లాగా పాత్ బ్రేకింగ్ డాన్సులు నట సార్వభౌమ వేయలేదు. ఎవరి ప్రత్యేకత వారిది. కంపారిజన్లు చేసేటప్పుడు చాలా మంది మర్చిపోతున్న ప్రాధమిక లాజిక్స్ ఇవి. ఇక అసలు విషయానికి వద్దాం.
టీవీ నటుడిగా, సినిమాల్లో మొదట నెగటివ్ షేడ్స్ వేషాలు ఎక్కువ వేసి తర్వాత తిరుగులేని స్టార్ గా ఎదిగిన షారుఖ్ ఖాన్ ప్రస్థానం వేరు. విపరీతమైన పోటీలో కృష్ణంరాజు వారసుడిగా వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ప్యాన్ ఇండియా స్థాయిలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా స్టార్ రేంజ్ కు చేరుకున్న ప్రభాస్ ప్రయాణం వేరు. ఎవరు కింగ్ ఎవరు సూపర్ స్టార్ అనే డిబేట్ కన్నా వీళ్ళ వల్ల వెయ్యి కోట్ల సినిమాలు ఎంత సులువుగా వరల్డ్ కు పరిచయమవుతున్నాయేది అర్థం చేసుకోవాలి. ఇది వదిలేసి ఏజ్ డిఫరెన్స్ చూసుకోకుండా మరీ ఇలాంటి ఆన్ లైన్ వార్లకు తావిస్తున్న వాళ్ళు అసలు తర్కాన్ని మర్చిపోయి ఏదేదో ప్రచారం చేసేస్తున్నారు.