ఉత్తరాఖండ్‌లోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్నాథ్ దేవాలయాల్లో ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని ఆలయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించింది. చార్ధామ్ పరిధిలోని ఈ ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలనే అంశాన్ని బద్రీనాథ్–కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) బోర్డు సమావేశంలో ఆమోదించనున్నట్లు సమాచారం.
ఈ రెండు ఆలయాలతో పాటు కమిటీ పరిధిలోకి వచ్చే ఇతర దేవాలయాల్లోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని బీకేటీసీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు. ఆలయాల సంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణ దృష్ట్యా ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు కమిటీ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే గంగోత్రి ధామ్‌లో హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించగా, దీనిపై గంగోత్రి టెంపుల్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలకూ ఇదే తరహా నిబంధనలు అమలు చేయాలని కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చార్ధామ్ యాత్ర ప్రారంభానికి ముందే ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశముందని సమాచారం.
ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 23న తిరిగి తెరుచుకోనుంది. కేదార్నాథ్ ఆలయం తెరుచుకునే తేదీని మహాశివరాత్రి రోజున ప్రకటించనున్నారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ 19న అక్షయ తృతీయ సందర్భంగా తెరుచుకోనున్నాయి. అయితే, ఈ కొత్త ప్రవేశ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.