కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మత్రి జోగి రమేష్ ను సిట్ అధికారులు నిన్న ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు జోగి రమేష్ ఈ కల్తీ మద్యం వ్యాపారానికి తెర తీశారని జనార్ధన రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు జోగిని అరెస్టు చేశారు. ఆ తర్వాత దాదాపు 11 గంటలపాటు జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును సిట్ అధికారులు, పోలీసులు వేర్వేరుగా విచారణ జరిపారు. అయితే, ప్రశ్న ఏదైనా సరే జోగి రమేష్ సమాధానం మాత్రం..తెలీదు..గుర్తులేదు…అని తెలుస్తోంది.
తనకు ఈ కేసుతో సంబంధం లేదని, అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు తనకు సమాధానలు తెలీదని జోగి రమేష్ అన్నారట. చంద్రబాబు ఇంటిపైకి తాను వెళ్లినందుకే ఈ కేసులో ఇరికించారని, తన కుమారుడిని అగ్రిగోల్డ్ భూముల కేసులో కక్షపూరితంగా ఇరికించారని చెప్పారట. ఇక, ఈ కేసులో ఏ1 అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో తనకు తెలియదని అన్నారట. కీలకమైన ప్రశ్నలు అడిగినప్పుడు కూడా జోగి సైలెంట్ గా ఉన్నారట. జోగి రమేష్ సోదరుడు రాము కూడా ఇలాగే సమాధానాలిచ్చారట.
జనార్థన్ ఎవరో తెలీదని, ఆయనతో కలిసి వ్యాపారాలు చేయలేదని, ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగలేదని జోగి రమేష్ అన్నారట. చివరిసారి జనార్ధన్ రావును ఎప్పుడు కలిశానో గుర్తు లేదని చెప్పారట. జనార్థన్ తో కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయని సిట్ అధికారులు ప్రశ్నించగా…అవి ఎలా వచ్చాయో తనకు తెలీదన్నారట. ఏది ఏమైనా…జోగి రమేష్ బాగా ప్రిపేర్ అయి వచ్చారని, ఆవు వ్యాసం మాదిరిగా తెలీదు..గుర్తులేదు..తప్ప మరో ముక్క చెప్పడం లేదని తెలుస్తోంది.