గత బుధవారం ‘రాజాసాబ్’ రెండో పాట లాంచ్ కోసం హైదరాబాద్ కూకటపల్లిలోని ‘లులు మాల్’లో చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ లోపంతో ఎంత అస్తవ్యస్తంగా తయారైందో తెలిసిందే. పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడగా.. వారి మధ్య నుంచి హీరోయిన్ నిధి అగర్వాల్‌ను బయటికి తీసుకురావడానికి తీవ్ర ఇబ్బంది తలెత్తింది. జనం మధ్య నలిగిపోయిన నిధి… ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంది.
ఈ ఘటన పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో కూకట్ పల్లి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. నిర్వాహకులతోపాటు మాల్ యాజమాన్యం పైనా కేసులు పెట్టారు. ఈవెంట్‌కు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసు విషయమై పోలీసులు.. నిధిని సంప్రదించారు. తనను ఇబ్బంది పెట్టిన వారి మీద కేసులు పెట్టాలని పోలీసులు కోరగా.. నిధి నిరాకరించిందట.
తనతో పలువురు అభిమానులు అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ.. వారి మీద ఫిర్యాదు చేయడానికి నిరాకరించిందట నిధి. పోలీసులు గట్టిగా అడిగినా.. తాను ఎవరి మీద ఫిర్యాదు చేయదలచుకోలేదని నిధి తేల్చి చెప్పేసిందట. ఇలాంటి వ్యవహారాలపై ఫిలిం సెలబ్రెటీలు స్పందించాలని.. వారు కఠినంగా వ్యవహరిస్తేనే అభిమానుల పేరుతో హద్దులు దాటి ప్రవర్తించే ఆకతాయిలకు బుద్ధి చెప్పగలమని పోలీసులు అంటున్నారు.
కానీ లోపం ప్రధానంగా నిర్వాహకులదే అన్న ఉద్దేశం కావచ్చు.. లేక ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల మీద ఏం ఫిర్యాదు చేస్తామని నిధి అనుకుందో కానీ.. పోలీసుల విజ్ఞప్తిని నిరాకరించింది. రాజాసాబ్ ఈవెంట్ సందర్భంగా నిధి అంత అసౌకర్యానికి గురైనప్పటికీ.. నిర్వాహకులను తప్పుబట్టడం కానీ, అభిమానుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ చేయలేదు. ఆ గందరగోళం తర్వాత కూడా ఆమె రాజాసాబ్ పాటపై సోషల్ మీడియా పోస్టు పెట్టింది. ఇప్పుడు ఫ్యాన్స్ మీద ఫిర్యాదు చేయకపోవడం చూసి నిధి బంగారం అంటూ ఆమెను నెటిజన్లు కొనియాడుతున్నారు.