hyderabadupdates.com movies ఫ్లాపుల ప్రవాహానికి బ్రేక్ పడుతుందంటారా

ఫ్లాపుల ప్రవాహానికి బ్రేక్ పడుతుందంటారా

ఏడేళ్ల క్రితం మహానటి చూశాక కీర్తి సురేష్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు. అందులో నటనని మరో హీరోయిన్ ఎవరూ మ్యాచ్ చేయలేరన్నది వాస్తవం. అంత ఫేమ్ తెచ్చుకున్న కీర్తి ఆ తర్వాత మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో నటించినా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. నితిన్ లాంటి టయర్ 2 హీరోలతో నటించినా మిస్ ఇండియా అంటూ తను మాత్రమే ఉండే టైటిల్ రోల్స్ చేసినా అన్నీ దారుణంగా పోయాయి. ఇప్పుడు నెలాఖరు నవంబర్ 28 రివాల్వర్ రీటాగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇది చాలా ఆలస్యమై వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పటికి మోక్షం దక్కించుకుంది.

తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కథేంటో చెప్పేశారు. ఒక పెద్ద మాఫియా డాన్ (సునీల్) తండ్రి కనిపించకుండా పోతాడు. అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారని అందరూ భావిస్తుండగా రీటా (కీర్తి సురేష్) ఇంట్లో శవమై ఉంటాడు. ఈ విషయం బయటికి పొక్కకుండా కుటుంబం మొత్తం చాలా జాగ్రత్త పడుతుంది. తల్లి (రాధికా) సహాయంతో శవం మాయం చేయాలని ప్లాన్ చేసుకుంటుంది రీటా. ఇంకోపక్క నాన్న ఏమయ్యాడో తెలియక సదరు డాన్ పిచ్చిపట్టిన వాడిలా అనుమానం వచ్చిన వాడినల్లా చంపుకుంటూ పోతాడు. చివరికి ఏమయ్యిందనేది తెరమీద చూడమంటున్నారు దర్శకుడు జెకె చంద్రు.

టేకింగ్ గట్రా చూస్తుంటే మరీ కొత్తగా ఏం లేదు. నయనతార కోకో కోకిలతో మొదలుపెట్టి తరుణ్ భాస్కర్ కీడా కోలా దాకా ఇలాంటి డార్క్ కామెడీ సినిమాలు చూసిన జనాలకు రివాల్వర్ రీటా అంత కొత్తగా ఏం చూపిస్తుందో చూడాలి. అసలే రామ్ ఆంధ్రకింగ్ తాలూకాతో పోటీ ఉంది. వారం తిరగడం ఆలస్యం బాలయ్య అఖండ 2తో వచ్చేస్తాడు. ఇంత పోటీ పెట్టుకుని రివాల్వర్ రీటా ఓ రేంజ్ లో ఉంటే తప్ప మెప్పించడం కష్టం. ఏడు సంవత్సరాల కాలంలో దసరా, సర్కార్ తప్ప చెప్పుకోదగ్గ హిట్టు లేని కీర్తి సురేష్ పదిహేనుకి పైగా ఫ్లాపులు చూసిందంటే ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ అదే నిజం. మరి రీటా బ్రేక్ ఇస్తుందో లేదో.

Related Post