కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆద్యంత ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన నారా లోకేష్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, దాయాది దేశం పాకిస్థాన్ వ్యవహార శైలిన ప్రస్తావించారు. ఆ రెండు దేశాలకు ప్రధాని మోడీ తగిన విధంగా బుద్ధి చెప్పారని అన్నారు.
ఈ సందర్భంలోనే “ఫ్లూట్ జింక ముందు ఊదు.. కానీ, సింహం ముందు కాదు!” అని ఆయా దేశాలకు పరోక్షంగా తేల్చి చెప్పారు. జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ద్వారా ప్రధాన మంత్రి దేశంలోని పేదలకు అనేక వరాలు ఇచ్చారని అన్నారు. తొలుత ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు కొందరు అధికారులు ప్రధానిని కలిసి.. ఇలా చేస్తే.. ప్రభుత్వానికి ఆర్థికంగా తీవ్ర నష్టం వస్తుందని చెప్పారని, అయినా పేదల కోసం.. తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని ప్రధాని చెప్పారని తెలిపారు.
ఈ క్రమంలోనే జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ భారత్ ను తిరుగులేని శక్తిగా నిలబెడుతున్నారని తెలిపారు. దేశాన్ని సూపర్ పవర్ గా మార్చిన నాయకుడు కూడా మోడీనేని తెలిపారు. “మోడీ కొట్టిన దెబ్బకు పాకిస్థాన్‌కు దిమ్మ తిరిగిపోయింది. అమెరికా సుంకాలు విధిస్తే.. ప్రపంచం విలవిలలాడిపోయింది. కానీ, మోడీ ఎక్కడా జంకలేదు. ఆత్మనిర్భర్ భారత్‌కు పెద్దపీట వేశారు. అందుకే చెబుతున్నా.. ఫ్లూటు జింక ముందు ఊదు. సింహం ముందు కాదు.” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ కేవలం దేశాన్ని మాత్రమే కాదని, రెండు తరాలను కూడా ముందుండి నడిపిస్తున్నారని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు దూసుకుపోతోందన్నారు. పేదలకు మేలు చేయడంలో ప్రధాని ముందుంటున్నారని కొనియాడారు. కేంద్రంలోను.. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రజలకు మేలు చేస్తోందన్నారు. జీఎస్టీ తగ్గింపుతో పేదలకు, వ్యాపారులకు కూడా మేలు జరుగుతోందన్నారు.