కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు. కొందరేమో ప్రోమోల ద్వారా కథ మీద ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చేలా చేస్తుంటారు. ప్రమోషన్లలో కూడా కథ గురించి ఓపెన్ అవుతుంటారు. ఐతే కథ గురించి ముందే ఒక ఐడియా ఇచ్చేస్తే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏం ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుంది.
స్టోరీ ఎక్కువ ఓపెన్ చేయడం వల్ల కొన్నిసార్లు సినిమాకు ప్రతికూలంగా కూడా మారుతుంటుంది. కానీ తమకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదంటూ శంబాల సినిమా స్టోరీ ఏంటో ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు యువ కథానాయకుడు ఆది సాయికుమార్.
ఆది చెప్పిన ప్రకారం.. ఇందులో హీరో ఒక యువ సైంటిస్ట్. అతను ప్రతి విషయాన్నీ సైంటిఫిక్ కోణంలో చూస్తాడు. అలాంటి వాడు.. ఒక పల్లెటూరిలో ఒక ఆస్టరాయిడ్ పడిందని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. ఆస్టరాయిడ్ శాస్త్ర సంబంధిత విషయం అని అతను పరిశోధన చేయాలనుకుంటాడు. కానీ ఆ ఊరిలో అందరికీ దైవ భక్తి ఎక్కువ.
మూఢ నమ్మకాలను ఎక్కువ నమ్ముతారు. ఆ ఊరిలో ఆస్టరాయిడ్ పడడాన్ని దుష్ట శక్తికి సంబంధించిన విషయంగా వాళ్లు భావిస్తారు. అలాంటి స్థితిలో ఆ ఊరి వాళ్లతో పోరాడి ఆ ఆస్టరాయిడ్‌కు సంబంధించిన వ్యవహారాన్ని హీరో ఎలా తేల్చాడు అన్నది ఈ సినిమా కథ.
మూఢ నమ్మకాలున్న ఊరికి సైంటిఫిక్ టెంపర్‌మెంట్ ఉన్న హీరో వెళ్లి నిజానిజాలు నిగ్గు తేల్చడం అనే పాయింట్ మీద గతంలో చాలా కథలే వచ్చాయి. కార్తికేయ కూడా ఈ లైన్లో సాగే సినిమానే. ఇలాంటి సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ.. తమ సినిమాలో అంతకుమించిన విశేషాలు, కొత్తదనం ఉందని అంటున్నాడు ఆది.
శంబాల స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే సినిమా అని.. ఇందులో కొత్త సీన్లు చాలా ఉంటాయని.. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా సాగుతుందని ఆది చెప్పాడు. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న రాబోతున్న ఈ చిత్రాన్ని యుగంధర్ ముని డైరెక్ట్ చేశాడు.