టాలీవుడ్ స్టార్ హీరోల్లో కథల ఎంపికలో మంచి జడ్జిమెంట్, సినిమాలు చేయడంలో తిరుగులేని ప్లానింగ్ ఉన్న స్టార్ హీరోగా అల్లు అర్జున్‌కు మంచి గుర్తింపు ఉంది. అతను ఏ కథనూ ఆషామాషీగా ఒప్పుకోడు. ఒక సినిమా తన కెరీర్‌కు ఏ విధంగా ఉపయోగపడుతుందో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. ప్రతి చిత్రంతోనూ ఒక మెట్టు పైకి ఎదగాలని.. తన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ విస్తరించాలని చూస్తాడు.
కాబట్టే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడిగా ఉన్నాడు. ‘పుష్ప’తో చాలా పెద్ద రేంజికి ఎదిగిపోయిన బన్నీ.. దానికి ఫాలోఅప్‌గా అట్లీ దర్శకత్వంలో సినిమా చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ అది కూడా పక్కా ప్లానింగ్‌తో తీసుకున్న నిర్ణయమే అన్నది స్పష్టం. ఇప్పుడు లోకేష్ కనకరాజ్‌తో సినిమాను ఓకే చేయడమూ ఈ ప్లానింగ్‌లో భాగమే.
బన్నీకి ఎప్పట్నుంచో తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. తెలుగు సినిమాల ద్వారా కర్ణాటకలోనూ బలమైన మార్కెట్ సంపాదించాడు. ఇక అనుకోకుండా ఎప్పుడో కేరళలో భారీగా అభిమానులను సంపాదించాడు. ‘పుష్ప’ మూవీతో నార్త్ ఇండియాలో అసాధారణమైన ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాడు. అట్లీ ఆల్రెడీ ‘జవాన్’తో ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇండియాలో బన్నీకి పెద్దగా ఆదరణ లేని రాష్ట్రం అంటే తమిళనాడు మాత్రమే.
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలు అక్కడ ఓ మాదిరిగా ఆడాయి కానీ.. బన్నీ మార్కెట్ అయితే బలపడలేదు. ఇప్పుడు అట్లీ, లోకేష్ కనకరాజ్ సినిమాలతో అతను ఆ మార్కెట్‌నూ కొల్లగొట్టడం గ్యారెంటీ. ఈ దర్శకుల వల్ల ఆ రెండు చిత్రాలూ తమిళంలో భారీగా విడుదలవుతాయి. స్ట్రెయిట్ సినిమాల స్థాయిలో రిలీజ్ ఉంటుంది.
ఈ సినిమాలు బాగుంటే అవి అక్కడ పెద్ద హిట్టయి బన్నీ తమిళంలోనూ పెద్ద స్టార్‌గా అవతరించే అవకాశముంది. ఆల్రెడీ విజయ్ సినిమాల నుంచి నిష్క్రమించడం.. మిగతా స్టార్లు సరైన సినిమాలను అందించకపోవడం వల్ల తమిళంలో ఒక వాక్యూమ్ ఏర్పడింది. దాన్ని బన్నీ క్యాప్చర్ చేయాలని చూస్తున్నాడు. డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తే బన్నీది మామూలు ప్లానింగ్ కాదని అర్థమవుతుంది.