కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు. అంతేకాదు.. గత ఐదేళ్లలో ఇక్కడ చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు కూడా నిర్వీర్య మయ్యాయి. మరోసారి కూడా చంద్రబాబుకు ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. భవిష్యత్తులో చంద్రబాబు కనుక తప్పుకొంటే.. నారా భువనేశ్వరి ఇక్కడ నుంచి పోటీ చేయనున్నారన్న వాదన వినిపిస్తోంది.
ఇదిలావుంటే.. ఇప్పుడు కుప్పం మాదిరిగానే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం కూడా వచ్చే 30 నుంచి 40 ఏళ్ల పాటు ఆయన అధీనంలో ఉంటుందన్న చర్చ సాగుతోంది. ఇప్పట్లో ఆయనను కదలించడం ఎవరి తరమూ కాదని కూడా అంటున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి ఇక్కడ నుంచి విజయందక్కించుకున్న పవన్.. తర్వాత కాలంలో పిఠాపురంతో ఎనలేని బంధాన్ని పెంచుకున్నారు.
మహిళలకు చీరలు, సారెల నుంచి నియోజకవర్గం అభివృద్ధి వరకు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా మనసు పెడుతున్నారు. తాజాగా 200 కోట్ల రూపాయల పైచిలుకు మొత్తంతో అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామాల్లో రహదారులు నిర్మిస్తున్నారు. ఇదేసమయంలో ప్రతి ఒక్కరికీ చేరువ అవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా పవన్ కల్యాణ్ ప్రజలకు చేరువ అయ్యారు.
ఈ పరిణామాలను గమనిస్తున్న వారు.. కుప్పం మాదిరిగా పిఠాపురం జనసేన ఖాతాలో సుదీర్ఘకాలం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజానికి ప్రజల సమస్యలు పరిష్కరం ఒక్కటే కాదు. వారికి అత్యంత ఆత్మీయుడిగా కుటుంబ సభ్యుడిగా కూడా.. పవన్ ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు. ఇది పిఠాపురంలో జనసేనను మరింత బలోపేతం చేస్తోంది. ఈ క్రమంలో పులివెందుల, కుప్పం తరహాలో పిఠాపురం జనసేనకు ఒక కీలక నియోజకవర్గంగా మారుతుందని భావిస్తున్నారు.