టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పాలనలోని లోపాలను ఎత్తి చూపడం .. విమర్శించడం వంటివి ప్రతిపక్ష పార్టీలుగా.. ప్రత్యర్థినాయకులుగా తప్పుకాదు. కానీ, ఆయనను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే?! అది ముమ్మాటికీ ఈ విమర్శలు చేసిన వారికి మేలు జరగకపోగా.. చంద్రబాబుకు మాత్రం సానుభూతి పెరుగుతుంది. ఎందుకంటే.. ఒకప్పటి మాదిరిగా వ్యవస్థలు లేవు. ఇప్పుడు అన్నీ క్షణాల్లో ప్రజలకు చేరువ అవుతున్నాయి. ఏం జరుగుతోంది? ఎవరు ఏం చేస్తున్నారు? అనే విషయాలను ప్రజలు తెలుసుకుంటున్నారు.
దీంతో నాయకులు చేసే వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకుని కం పేర్ చేసుకుంటున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబుపై చేసిన కీలక వ్యాఖ్యల అనంతరం.. ఈ చర్చ సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా బాబు ఎవరికీ క్రెడిట్ ఇవ్వరని.. ఎవరో చేసినపనిని కూడా ఆయనే చేసినట్టు బిల్డప్ ఇస్తారని జగన్ అన్నారు. అయితే.. నిజానికి దీనిలో ఎంత వాస్తవం అనేది విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అన్నీ తనఖాతాలో ఎప్పుడూ వేసుకోలేదన్నారు.
ఉదాహరణకు ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు వంటివి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చారు. దీంతో చంద్రబాబు వాటిని ప్రస్తావించినప్పటికీ.. కొనసాగిస్తున్నప్పటికీ.. తన ఖాతాలో ఎక్కడా వేసుకోలేదు. ఇక, హైదరాబాద్ మొత్తం నేనే కట్టానని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదు. సైబరాబాద్ కట్టించానని.. రహదారులు విస్తరించానని చెప్పారు. అంతేకాదు.. అదేసమయంలో తన తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్, కిరణ్‌కుమార్ రెడ్డిలు వాటిని కొనసాగించారనే చెప్పారు తప్ప.. తన ఖాతాలో మొత్తం వేసుకోలేదు.
ఇక, క్రెడిట్ చోరీలో చంద్రబాబు ముందున్నట్టు జగన్ చెప్పారు. కానీ.. అలా చంద్రబాబు ఎవరో చేసిన పనులను తన ఖాతాలో వేసుకోలేదు. గతంలో సంస్కరణలు తీసుకువచ్చిన.. పీవీ నరసింహారావును ఆయన ఇప్పటికీ ప్రస్తావిస్తారు. తర్వాతే తానని అనేక సందర్భాల్లో చెప్పారు. ఇక, ఐటీ విషయంలో మాత్రం చంద్రబాబు ఆద్యుడు కాబట్టే ఆ క్రెడిట్ తీసుకుంటున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. జగన్ చేసిన వ్యాఖ్యలను పోల్చి చూస్తున్న విశ్లేషకులు.. అనూహ్యంగా ఆయన బాబుకు మైలేజీ.. సింపతీ కూడా పెంచుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.