ఏపీ సీఎం చంద్రబాబు మరో రికార్డు సాధించారు. గత కొన్నాళ్లుగా నిప్పులు చెరుగుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఆయన పండగ పూట సంతోష పరిచారు. ఇది నిజంగానే రికార్డని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు.. నిప్పులు చెరిగాయి. తమకు వెంటనే డీఏ బకాయిలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాయి. అదేసమయంలో పీఆర్సీ వంటివాటిని కూడా వెంటనే ఇవ్వాలని కోరారు. నిజానికి ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు మంత్రి వర్గ ఉపసంఘానికి అప్పగించేశారు. దీనిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. వీరు శనివారం మధ్యాహ్నం నుంచి సుమారు నాలుగు గంటల పాటు చర్చించారు.
అయితే.. డీఏ బకాయిలే 7 వేల కోట్ల రూపాయలు ఉండడం.. పీఆర్సీ రూపంలో మరొక గుదిబండ ఎదురుగా కనిపించడం.. వీటికి ఉద్యోగులు పట్టుబట్టడంతో నిజానికి ఈ చర్చలు ఎప్పటికీ తెగలేదు. రాత్రి 9 గంటల వరకు కూడా ఎడతెగని చర్చలు కొనసాగాయి. ఇలాంటి సమయంలో మరోసారి చర్చిద్దామని మంత్రివర్గ ఉపసంఘం తేల్చేయాలని అనుకుంది. కానీ, ఇంతలోనే సీఎం చంద్రబాబు నుంచి ఫోన్ రావడంతో విషయం ఆయన వరకు చేరింది. దీంతో దీపావళి ముంగిట ఉద్యోగులను అసంతృప్తి పరచకూడదన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు చంద్రబాబు పార్టీ కార్యాలయం నుంచి మళ్లీ సచివాలయానికి చేరుకున్నారు.
అప్పటికే చర్చల్లో ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. నిజానికి సీఎం వచ్చే వరకు కూడా ఈ విషయం వారికి తెలియదు. సీఎం వస్తున్నారని.. తమతో చర్చిస్తారని కూడా వారికి సమాచారం లేదు. పండగ ముందు.. హఠాత్తుగా ఉద్యోగ సంఘాల నాయకులతో స్వయంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు వారి సమస్యలపై సావధానంగా చర్చించారు. అదేసమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా వివరించారు. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నామని వారికి చెబుతూ.. ఒక డీఏ(సుమారు రూ.3 వేల కోట్లు) ఇచ్చేందుకు అంగీకరించారు. దీనిని వచ్చేనెల నుంచి ఉద్యోగుల ఖాతాల్లో వేయనున్నట్టు తెలిపారు.
అదేసమయంలో ఇతర సమస్యలపైనా చర్చించారు. పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగులను ఒప్పించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగు పడిన తర్వాత.. పీఆర్సీ వేస్తామనిచెప్పారు. నిజానికి ఈ ప్రతిపాదనకు ఉద్యోగులు ఒప్పుకోరు. కానీ, సీఎం స్వయంగా జోక్యం చేసుకుని చెప్పడంతో నోటమాటలేదు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు ప్రమోషన్లు, వారికి ఇవ్వాల్సిన భత్యాలు ఇస్తామన్నారు. పోలీసులకు ఇవ్వాల్సిన ఈఎల్స్ విషయంపై కూడా తేల్చేశారు. మొత్తంగా ఈ భేటీ ఎటు మళ్లుతుందో అనుకున్న ఉద్యోగులకు సంతోషం కట్టలు తెగింది. దీపావళి ముందు వారిని సీఎం అన్ని రూపాల్లో ఆదుకుంటామని ఇచ్చిన హ్యాపీస్‌తో ఇంటి ముఖం పట్టారు. ఇదీ.. సీఎం చంద్రబాబు సీనియార్టీ. గతంలో సీఎం జగన్ జూనియర్టీగానే పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శనం కోసం ఉద్యోగులు విలవిల్లాడిన విషయం తెలిసిందే.