hyderabadupdates.com movies బీఆర్ఎస్ నోట ఓట్ చోరీ మాట‌: హైకోర్టుకు నేత‌లు!

బీఆర్ఎస్ నోట ఓట్ చోరీ మాట‌: హైకోర్టుకు నేత‌లు!

చిత్రంగా ఉన్నా.. ఇది వాస్త‌వం. ఇప్ప‌టి వ‌ర‌కు బీహార్‌లో మాత్ర‌మే వినిపించిన ఓట్ చోరీ మాట‌.. ఇప్పుడు తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ నోట కూడా వినిపించింది. అనూహ్యంగా ఆ పార్టీ ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ విష‌యంపై విచార‌ణను చేప‌ట్టాల‌ని.. త‌క్ష‌ణ‌మే విచారించాల‌ని కోరుతూ.. గురువారం లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిలో ప‌లు విష‌యాల‌ను పేర్కొంది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌.. అటు అధికార కాంగ్రెస్ పార్టీకి, ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌కు కూడా కీల‌కంగా మారిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అభ్య‌ర్థిని కూడా ఖ‌రారు చేసిన బీఆర్ఎస్.. మాగంటి సునీత‌తో నామినేష‌న్ కూడా వేయించింది. ఇక‌, మ‌రోవైపు.. ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే జాబితాల‌ను కూడా రిలీజ్ చేసింది. ఇంత జ‌రిగిన త‌ర్వాత‌.. అనూహ్యంగా జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జ‌రిగింద‌ని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ల‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది.

జూబ్లీహిల్స్‌లో సుమారు 30 వేల ఓట్లను తొల‌గించార‌ని పేర్కొన్న బీఆర్ఎస్‌.. భారీ ఎత్తున న‌కిలీ ఓట‌ర్ల‌ను.. చేర్చార‌ని ఆరోపించింది. కాంగ్రెస్‌, బీజేపీల‌కు అనుకూలంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఓట‌ర్ల‌ను తీసుకు వ‌చ్చి .. ఇక్క‌డ ఓటు హ‌క్కు క‌ల్పించార‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. త‌ద్వారా ఏక‌ప‌క్షంగా గెలిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పేర్కొంది. దీనిపై త‌క్ష‌ణం విచార‌ణ జ‌రపాల‌ని కోరింది. అయితే.. వాస్త‌వానికి ఎన్నిక‌ల సంఘం జాబితాల‌ను కూడా రెడీ చేసి విడుద‌ల చేసిన త‌ర్వాత‌.. బీఆర్ఎస్ ఎత్తి చూపిన ఈ వాద‌న ఏమేర‌కు నిల‌బ‌డుతుందో చూడాలి.

Related Post