hyderabadupdates.com movies బీఆర్ ఎస్ అందుకే ఓడిపోయింది: రేవంత్‌రెడ్డి విప్పిన గుట్టు…!

బీఆర్ ఎస్ అందుకే ఓడిపోయింది: రేవంత్‌రెడ్డి విప్పిన గుట్టు…!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న కామెంట్లు చేశారు. 2023లో బీఆర్ ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింద‌న్న విషయం ఇప్ప‌టికీ స‌స్పెన్సుగానే ఉంది. “అరె..మేం ఏం త‌క్కువ చేసినం. అయినా ఎందుకు ఓడ‌గొట్టారు?“ అని మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప‌లు సంద‌ర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇక‌, ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు మాజీ మంత్రి కేటీఆర్ సైతం.. తాము ఎందుకు ఓడిపోయామో.. అర్ధం కావ‌డం లేద‌ని తొలినాళ్ల‌లో అన్నారు. ఆ త‌ర్వాత‌.. పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల కార‌ణంగానే త‌మ పార్టీ ఓడిపోయింద‌ని చెప్పుకొచ్చారు.

ఇక‌, అప్ప‌టి రిజల్ట్ చూస్తే.. ద‌ళిత బంధు, రైతు భ‌రోసా, గొర్రెల పంపిణీ, బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ వంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి.. గ్రామాల్లో దిగ్విజ‌యంగా పూర్తి చేసినా.. అక్క‌డ బీఆర్ ఎస్‌కు వ్య‌తిరేక ఫ‌లితం వ‌చ్చింది. కానీ.. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఓట్లు ప‌డ్డాయి. కానీ.. దీనిపై పెద్ద‌గా బీఆర్ ఎస్ అధ్య‌య‌నం చేసిన‌ట్టుక‌నిపించ‌లేదు. ఇక‌, `ఎందుకు ఓడిపోయాం` అనే ప్ర‌శ్న‌.. ఇప్ప‌టికీ మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే బీఆర్ ఎస్‌ను వెంటాడుతోంది. తాజాగా.. ఈ విష‌యంపై సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న విష‌యాలు చెప్పుకొచ్చారు. 2023 ఎన్నిక‌ల్లో ఏం జ‌రిగింద‌న్న దానిపై ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

`ధ‌ర‌ణి చ‌ట్ట‌మే` ఆనాడు బీఆర్ ఎస్‌ను మ‌ట్టిక‌రిపించింద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూమితో పెట్టుకుంటే.. ప్ర‌జ‌లు ఎలా స్పందిస్తారో.. నాటి ధ‌రణి చ‌ట్ట‌మే ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు. ఆనాడు.. స‌ర్వేల పేరుతో రైతుల‌ను మోసంచేశార‌ని.. భూమికి-రైతుకు మ‌ధ్య ఎంతో అనుబంధం ఉంటుంద‌న్నారు. దానిని ఉడ‌గొట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం వ‌ల్లే.. బీఆర్ ఎస్ ఓడిపోయింద‌న్నారు. “మేం ఎన్నిక‌ల్లో గెలిచాం.. దీనిని అనేక కార‌ణాలు ఉన్నాయి. కానీ, బీఆర్ ఎస్ ఎందుకు ఓడిపోయింది? అనే దానికి ఒకే ఒక కార‌ణం. అదే ధ‌ర‌ణి చ‌ట్టం. ఆనాడు ఈ చ‌ట్టాన్ని అడ్డు పెట్టుకుని పేద‌ల భూములు లాక్కునే ప్ర‌య‌త్నం చేశారు. అందుకే ప్ర‌జ‌లు ఓడించారు“ అని రేవంత్ రెడ్డి గుట్టు బ‌య‌ట పెట్టారు.

తాజాగా రాష్ట్రంలో చేప‌ట్ట‌నున్న స‌ర్వేకు సంబంధించి కొత్త‌గా వేల మందికి శిక్ష‌ణ ఇచ్చారు. స‌ర్వేయ‌ర్లుగా వారిని నియ‌మించనున్నారు. ఈ క్ర‌మంలో వారికి లైసెన్సులు ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న బీఆర్ ఎస్ ఓట‌మి, గ‌త ఎన్నిక‌ల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము ధ‌రణిని తొల‌గిస్తామ‌ని హామీ ఇచ్చామ‌ని.. ప్ర‌భుత్వ ప‌గ్గాలు చేప‌ట్ట‌గానే దానిని తీసేశామ‌న్నారు. దాని స్థానంలో భూభార‌తిని తీసుకువ‌చ్చామ‌ని వివ‌రించారు. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఫిర్యాదులు రాలేద‌ని తెలిపారు.

Related Post