hyderabadupdates.com movies బీజేపీ ఎమ్మెల్యే నోట రాజీమానా మాట

బీజేపీ ఎమ్మెల్యే నోట రాజీమానా మాట

ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి పక్కా ప్రణాళికలతో కేటమి సాగుతోంది. కూటమిలోని 3 పార్టీల మధ్య కూడా పెద్దగా పొరపొచ్చాలేమి లేవనే చెప్పాలి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలను జనసేన, బీజేపీలు స్వాగతిస్తున్నాయి.

టీడీపీతో కలిసి ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బీజేపీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పెద్దలు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించిన ఆయన… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకూ వెనుకాడబోనని ఆయన నిజంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలేం జరిగిందన్న విషయాన్ని పెద్దగా ప్రస్తావించని ఆదినారాయణ రెడ్డి… కూటమిలోని పెద్దలు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తాను ప్రతిపాదించిన చాలా పనులు పట్టాలెక్కడం లేదనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను గెలిపించిన ప్రజల సంక్షేమం కోసం తాను చెప్పిన పనులు జరగకపోతే… ఇక ఎమ్మెల్యేగా తాను కొనసాగి ఏం లాభం అని ఆయన ప్రశ్నించారు. తన నియోజకవర్గంలోని కీలక నేతలతో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

పదవి ముఖ్యమా, తనను గెలిపించిన ప్రజలు ముఖ్యమా అని అడిగితే… తనకు పదవి కన్నా గెలిపించిన ప్రజలే ముఖ్యమని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. తన ప్రజల కోసం తాను అడిగిన పనులకు కూటమి సర్కారు పచ్చ జెండా ఊపాల్సిందేనని, అలా కాని పక్షంలో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. అధికారంలో కూటమిలో కొనసాగుతున్న బీజేపీ ఎమ్మెల్యేగా తాను అడిగిన పనులే జరగకపోతే… ఇక తాను ఎమ్మెల్యేగా కొనసాగడంలో అర్థం ఏముందని కూడా ఆయన ప్రశ్నించారు. 

తొలుత కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైసీపీ, అటు తర్వాత టీడీపీ, ఆపై బీజేపీలోకి చేరిన ఆదినారాయణ రెడ్డి.. జమ్మలమడుగు నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, వైసీపీలో దక్కని మంత్రి పదవి ఆయనకు టీడీపీలో దక్కింది. అయినా ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరారు.

ఎమ్మెల్యేగా, మంత్రిగా తనదైన శైలిలో సాగిన ఆయన పలు వివాదాలను కూడా కొనితెచ్చుకున్నారు. కూటమి పార్టీల నేతలతోనూ ఆయన తగవు పెట్టుకున్న సందర్భం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా కూటమి పెద్దలే తనను ఇబ్బంది పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించడం, రాజీనామాకూ వెనుకాడడని చెప్పడం కలకలం రేపుతోంది.

Related Post