బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కీలకమైన రెండు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో రాజకీయ ప్రకంపనులు కొనసాగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం దక్కించుకుంది. సర్వేలకు సైతం అందని విధంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి పార్టీలు గెలుపు గుర్రం ఎక్కాయి. అయితే అసలు ఏం జరిగింది? నిజంగానే ప్రజలు ఎన్డీఏకి ఓటేశారా? లేదా? అనే రాజకీయ విమర్శలను పక్కనపెడితే ఈ ప్రభావం వచ్చే ఆరు మాసాల్లో ఎన్నికల జరగనున్న రెండు కీలక రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా ఆయా రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు వణుకుతున్నాయనే చెప్పాలి. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల విషయంపై తీవ్రంగా స్పందించారు. అంతేకాదు ఇదే సమయంలో ఇండియా కూటమిపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇండియా కూటమి మారకపోతే ఇక పరిస్థితులు చేతులు దాటతాయని కూడా చెప్పుకొచ్చారు.
సో దీనిని బట్టి తమిళనాడులో ఇండియా కూటమి లో డీఎంకే తప్పుకునే అవకాశం కనిపిస్తోంది. ఒంటరి పోరు లేదా ఇతర పార్టీలను కలుపుకుని డిఎంకె ముందుకు సాగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో డిఎంకె ఏక మొత్తంలో 133 స్థానాలు దక్కించుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ తరహా పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఉండే అవకాశం లేదన్నది డిఎంకె వర్గాలు ఇప్పుడే అంచనా వేస్తున్నారు.
ఇక మరో రాష్ట్రం పశ్చిమబెంగాల్లోనూ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలు దక్కించుకుని మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 215 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పుడు మరో నాలుగు ఐదు మాసాల్లోనే ఈ రాష్ట్రంలోనూ అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనంతరం ఇంత భారీ స్థాయిలో తమకు సీట్లు దక్కుతాయా అసలు ఏ మ్యాజిక్ జరుగుతుంది అనేది ఇప్పుడు అక్కడ కూడా అధికార పార్టీ నాయకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని అధికార పార్టీ ల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఒకరకంగా వణుకు పుట్టిస్తోంది అన్నది పరిశీలకులు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.