బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల పండితులకు సైతం అర్థం కాని విధంగా ప్రజలు తీర్పు చెప్పారు. అధికార ఎన్డీయే కూటమికి భారీ మద్దతుగా ప్రజలు నిలిచారు. గతానికి భిన్నంగా అధికార పార్టీకే వరుసగా పగ్గాలు అప్పగించారు. కనీ వినీ ఎరుగని మెజారిటీని కూడా కట్టబెట్టారు. అదే సమయంలో ప్రత్యర్థులను మట్టి కరిపించారు. “ఇంకేముంది ప్రభుత్వం వ్యతిరేకతే మాకు కలిసివస్తుంది మాదే విజయం” అని చొక్కాలు ఎగేసుకున్న వారిని ప్రజలు తిప్పికొట్టారు. కనీసం సానుభూతి కూడా చూపించలేదు. దీనికి కారణం “ఆటవిక పాలన” అనే ముద్ర పడడమే.
ఆశ్చర్యం కాదు నిజం. జాతీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్‌లో ఆర్జేడీ పాత్ర కీలకం. ఈ కూటమి విజయం దక్కించుకుంటే ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేవారు. కానీ ఆ పార్టీ పుట్టిన ఆదిలోనే మునిగిపోయింది. అనేక ఆశలు అనేక ఆకాంక్షలు కూడా నేలమట్టం అయ్యాయి. దీనికి కారణం జంగిల్ రాజ్ పాలన అనే మచ్చ ఆర్జేడీపై పడటం. ఆర్జేడీ అధినేత, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, అతని సతీమణి రబ్రీదేవి వరుసగా బీహార్‌కు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
కానీ వారి పాలనలో జంగిల్ రాజ్ (ఆటవిక పాలన) సాగిందన్నది ప్రజల్లో ఉంది. ప్రజలను లెక్కచేయని తనం, తలబిరుసు, ప్రతి పనికీ అవినీతి, అంతేకాదు ప్రభుత్వం అంటే నిరంకుశత్వం ఇవి జంగిల్ రాజ్‌కు అర్థం తెచ్చిన పాలన. ఈ మాయని మచ్చను తుడిచేందుకు వారి వారసుడిగా తెరమీదకు వచ్చిన తేజస్వి యాదవ్ కొంతవరకు తుడిచే ప్రయత్నం చేశారు. కానీ 20 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలకు ఆ ఆటవిక పాలన ఇంకా గుర్తుంది. దీనిని బీజేపీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికల సమయంలో ఆనాటి బాధితులు వెలుగులోకి వచ్చి ఆర్జేడీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఫలితంగా ఆర్జేడీ తుడిచిపెట్టుకుపోయింది.
కట్ చేస్తే ఇప్పుడే ఏపీలో జగన్‌కు ఈ బీహార్ ఫలితం గుణపాఠం కావాలి. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ పుంజుకోవాలంటే గత ఎన్నికల సమయంలో జగన్‌పై మరియు ఆ పార్టీ నాయకులపై పడిన మరకలను తుడిచే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మూడు రాజధానుల నిర్ణయం, ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు, మహిళలంటే గౌరవం లేకుండా నాయకులు చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిపతిగా సమర్థించిన తీరు ఇంకా అనేక అంశాలను జగన్ సవరించుకోవాలి. అదే సమయంలో ప్రజలకు చేరువ కావాలి. ఇవేవీ చేయకుండా ప్రభుత్వం వ్యతిరేకతే తన్ను కాపాడుతుందిని భావిస్తే జగన్‌కు బీహార్ గతి తప్పదని విశ్లేషకుల అభిప్రాయం.