hyderabadupdates.com movies బీహార్ దంగ‌ల్‌: కాంగ్రెస్ క్లారిటీ.. బీజేపీకి సెగ‌!

బీహార్ దంగ‌ల్‌: కాంగ్రెస్ క్లారిటీ.. బీజేపీకి సెగ‌!

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌కు మ‌రో 15 రోజుల గ‌డువు మాత్ర‌మే ఉన్న స‌మ‌యంలో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్ నేతృత్వంలోని మ‌హాఘ‌ట్‌బంధ‌న్ కూట‌మిలో ఏర్ప‌డిన అనిశ్చితి పూర్తిగా తొలిగిపోయింది. దీంతో ఇప్పుడు.. మ‌హాఘ‌ట్ బంధ‌న్ నాయ‌కులు పుంజుకున్నారు. పూర్తిస్థాయిలో ప్ర‌చారంపై దృష్టి పెట్ట‌నున్నారు. అయితే.. మ‌రో చిన్న స‌మ‌స్య ఈ కూట‌మిని వెంటాడుతోంది. 8 స్థానాల్లో కూట‌మిలోని మూడు కీల‌క పార్టీలు.. కాంగ్రెస్‌-ఆర్జేడీ-సీపీఐలు.. వారి వారి అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దించాయి.

వాస్త‌వానికి కూట‌మిలో ఉన్న పార్టీలో ఏదో ఒక పార్టీ మాత్ర‌మే త‌మ అభ్య‌ర్థిని బ‌రిలో నిల‌పాల్సి ఉంటుంది. కానీ ఈ 8 స్థానాల్లో ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం రానుంద‌ని నాయ‌కులు చెప్పారు. ఇక‌, తాజాగా జ‌రిగిన ప‌రిణామం చూస్తే.. మ‌హాఘ‌ట్ బంధ‌న్ క‌నుక వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంటే ముఖ్య‌మంత్రిగా ఆర్జేడీ యువ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ ప‌గ్గాలు చేప‌డ‌తార‌ని కాంగ్రెస్ పార్టీ లైన్ క్లియ‌ర్ చేసింది. ఈ మేర‌కు పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు అశోక్ గెహ్లోత్ గురువారం సాయంత్రం ప్ర‌క‌ట‌న చేశారు.

అంతేకాదు.. మ‌హాఘ‌ట్ బంధ‌న్‌ను ముందుకు న‌డిపించే బాధ్య‌తు కూడా ఆయ‌న‌కే అప్ప‌గించారు. మంత్రి వ‌ర్గంలో సీట్ల‌పై ఉమ్మ‌డిగా చ‌ర్చించుకుంటామ‌న్నారు. ఫ‌లితంగా ఇప్ప‌టి వ‌ర‌కు డోలాయ‌మానంలో ఉన్న తేజ‌స్వి యాద‌వ్‌కు కాంగ్రెస్ తీపిక‌బురు చెప్పిన‌ట్టు అయింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా.. ఈ వ్య‌వ‌హారమే పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. అయితే.. తాజాగా ఈ విష‌యంలో కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వ‌డంతో తేజ‌స్వి అభిమానులు, ఆర్జేడీ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా సంబ‌రాలు చేసుకున్నారు.

బీజేపీకి ఇబ్బందే!

తేజ‌స్వి యాద‌వ్‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌కటించిన త‌ర్వాత‌.. బీహార్‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు సంపూర్ణంగా మారాయి. తేజ‌స్వి యువ నాయ‌కుడు కావ‌డంతో మెజారిటీ య‌వ‌త ఆయ‌న‌ను అనుస‌రించే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా యాద‌వులు, కుర్మి సామాజిక వ‌ర్గం కూడా తేజ‌స్విని కోరుకుంటున్నారు. ఇది బీజేపీకి ఇబ్బంది క‌లిగించే అంశంగా మార‌నుంది. పైగా.. బీజేపీ త‌ర‌ఫున సీఎం అభ్య‌ర్థి ఎవ‌రంటూ.. ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి.

నితీష్ కుమార్‌కు మ‌తిమ‌రుపు వ‌చ్చింద‌న్న ప్ర‌చారంతో ఆయ‌న‌ను మ‌రోసారి ప్ర‌క‌టిస్తే అది కాంగ్రెస్‌కు ల‌బ్ధి చేకూర్చే అంశ‌మ‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. అలాగ‌ని త‌మ పార్టీ నాయ‌కుడిని ప్ర‌క‌టిస్తే.. అది నీతిష్‌కు కోపం తెప్పించ‌డ‌మే అవుతుంద‌న్న అంచ‌నా వేస్తున్నారు. దీంతో సీఎం అభ్య‌ర్థి విష‌యంలో బీజేపీ ఎటూ తేల్చుకోలేక పోతోంది.

Related Post