రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్.. బుల్లెట్ మాదిరిగా దూసుకుపోతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామని.. తొలి ఏడాదిలోనే మొత్తం 4.7 లక్షల ఉద్యోగాలను కల్పించినట్టు వివరించారు. తాజాగా విశాఖ పట్నంలో పర్యటించిన మంత్రి లోకేష్.. ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఒక్క ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. విశాఖలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకుసంస్థలు క్యూ కట్టాయని వివరించారు. కేంద్రం నుంచి సహకారం సంపూర్ణంగా ఉందని.. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ విషయంలో ఉదారంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విపక్ష నాయకులపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కొందరు మారీచుల మాదిరిగా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని తెలిపారు.
పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తున్న కంపెనీలను ప్రోత్సహిస్తే.. ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు. అందుకే.. కోర్టులకు కూడా వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయినా.. తమ ప్రభుత్వం అన్ని చట్ట నిబంధనలు పాటించి పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తోందని మంత్రి వివరించారు. కేంద్రం చేపట్టే సంస్కరణల్లో ఏపీకి ప్రాధాన్యం ఇస్తోందన్న మంత్రి.. ఇప్పటికే పలు కార్యక్రమాలకు కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకున్నామని చెప్పారు.
ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్ అయ్యేందుకు 3 దశాబ్దాలు పట్టిందని, కానీ.. ఇప్పుడు విశాఖను కేవలం పదేళ్లలోనే పరుగులు పెట్టిస్తామన్నారు. హైదరాబాద్ స్థాయిలో విశాఖను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. “మనకు విజన్ ఉన్న ముఖ్యమంత్రి, దూరదృష్టి ఉన్న ప్రధాని ఉన్నారు. ఇదే మన బలం. అధికార, రాజకీయ పొరపాట్లకు తావులేకుండా ప్రజల కోసం వారు నిరంతరం పనిచేస్తున్నారు.“ అని మంత్రి వివరించారు.
రాజధానిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుందన్నారు. అదేసమయంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తుగ్లక్ మాత్రమే రాజధానిని మార్చాడని ఈ సందర్బంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై పరోక్షంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి త్వరలోనే 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. అయితే.. ఐటీ రాజధానిగా ఉన్న విశాఖకు 50 శాతం పెట్టుబడులు రానున్నాయని వివరించారు.