బేబీ క్లైమాక్స్ లో కలుసుకోలేక ప్రేమ విఫలమైన జంటగా మిగిలిపోయిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈసారి ఆ తప్పు చేయడం లేదు. హ్యాపీగా అమెరికాలో కలుసుకుని తమ కొత్త లవ్ స్టోరీని ప్రేమికులకు చూపించబోతున్నారు. 90స్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ కు హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. 90స్ మిడిల్ క్లాస్ లో శివాజీ కొడుకుగా నటించిన బుడ్డోడు పెద్దయ్యాక యుఎస్ లో చదువుకుంటే ఎలా ఉంటుందనే పాయింట్ మీద వెరైటీగా రాసుకున్నారు. ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ అనే వెరైటీ టైటిల్ లాక్ చేసి టీజర్ వదిలారు.
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ అయిపోయాక కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో స్పష్టమైన అవగాహన ఉన్న అమ్మాయి, వాటికి పూర్తి విరుద్ధంగా యుస్ వీధుల్లో చొక్కా లేకుండా గద్దర్ పాటలు పాడే అబ్బాయికి మధ్య ప్రేమ కుదరడమే ఇందులో క్రియేటివిటీ. మొత్తం ఫారిన్ లొకేషన్ లోనే షూట్ చేసిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హెయిర్ స్టైల్ మార్చడంతో పాటు ఆనంద్ దేవరకొండని డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా విదేశాల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాలు అంతగా వర్కౌట్ కావడం లేదు. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసేలా ఉన్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ అంచనాలైతే రేపింది.
ఇక విడుదల విషయానికి వస్తే ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు కానీ ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో ఉండే అవకాశముంది. షూటింగ్ దాదాపు పూర్తయిపోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిజానికీ ప్రాజెక్ట్ ఆదిత్య హాసన్ మొదట నితిన్ తో ప్లాన్ చేసుకున్నట్టు గత ఏడాది వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఈ కాంబో డ్రాప్ అయ్యింది. ఆ లక్కు కాస్తా ఆనంద్ దేవరకొండను వరించింది. బేబీ తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం కోసం ఎదురు చూస్తున్న బేబీ హీరోకి ఇది ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. అటు వైష్ణవి చైతన్య కూడా వరస ఫ్లాపుల తర్వాత సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది. బేబీ జంటను ఎపిక్ ఏం చేస్తుందో చూడాలి.