ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటేనే.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు.. గీతా జయంతినాడు ఆయన ఏకంగా భగవద్గీత పారాయణ కూడా చేస్తారు. ఇటీవల కర్ణాటకలోని శ్రీకృష్ణ మఠానికి వెళ్లినప్పుడు కూడా భగవద్గీత లక్ష గళ పారాయణలోనూ పాల్గొన్నారు. అయోధ్యలో 5 దశాబ్దాల నాటి కలను నిజం చేస్తూ.. రామమందిరాన్ని సాకారం చేశారు. ఇక, ఎక్కడ ఏ అవకాశం చిక్కినా.. ఆయన రాముడు, కృష్ణుడు.. హిందూ పరివార దేవతల గురించే చెబుతారు.
అన్యమతాలు.. ఇతర మతగ్రంథాల గురించి ఎప్పడూ.. ప్రధాని మోడీ మాట్లాడింది లేదు. అలాంటి ప్రధాని.. తాజాగా క్రిస్మస్‌ను పురస్కరించుకుని చర్చికి వెళ్తారని ఎవరైనా ఊహిస్తారా? ఒకవేళ వెళ్లినా.. ఆయన బైబిల్‌ను పట్టుకుని.. వాక్యం చదువుతారని అనుకుంటారా? పోనీ.. ఇది కూడా చేశారని అనుకున్నా.. క్రైస్తవ ప్రార్థనలు, గీతాలాపనలో పాల్గొని.. తాళం వేస్తారా? అంటే.. ఇలా ఊహించనివి ఎన్నో ప్రధాని మోడీ తాజాగా చేసి చూపించారు. ప్రస్తుతం మోడీ చర్చికి వెళ్లడం, బైబిల్ చేత పట్టుకుని వాక్యం చదవడం.. గీతాలకు తాళం వేయడం వంటివి చూసి.. నెటిజన్లే కాదు.. బీజేపీ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కెథెడ్రల్ చర్చ్‌కు వెళ్లిన ప్రధానికి చర్చి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం.. నిర్వహించిన ప్రత్యేక గీతాలపానలో ప్రధాని పాల్గొన్నారు. అదేవిధంగా చర్చి మతాచార్యులు.. బైబిల్‌లోని వాక్యాలను చదివి.. ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొన్నారు. కాగా.. క్రిస్మస్ పర్వదినం.. దయ, ప్రేమ పట్ల నిబద్ధతను చాటు తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఎందుకు?
అయితే.. ఉన్నపళాన ఈ ఏడాది ప్రధాని చర్చికి వెళ్లడం వెనుక బలమైన కారణమే ఉంది. ప్రస్తుతం దేశంలోని క్రైస్తవుల గురించి కాకపోయినా.. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ క్రిస్టియానిటీని పాటిస్తున్న బ్రిటన్, రష్యా, దక్షిణ కొరియా వంటి అతి పెద్ద దేశాలతో ప్రధాని మిత్రత్వం కోరుకుంటున్నారు. అదేసమయంలో అమెరికాతో మాత్రం అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలను మరింత మచ్చిక చేసుకునే వ్యూహాత్మక ఆలోచనతోనే ప్రధాని చర్చిల బాట పట్టారన్న వాదన వినిపిస్తోంది.
May Christmas bring renewed hope, warmth and a shared commitment to kindness.Here are highlights from the Christmas morning service at The Cathedral Church of the Redemption. pic.twitter.com/BzvKYQ8N0H— Narendra Modi (@narendramodi) December 25, 2025