బోరుగడ్డ అనిల్.. ఏపీ రాజకీయాల్లో తరచుగా వినపడే పేరది. గత వైసీపీ పాలనలో జగన్ సానుభూతిపరుడిగా గుర్తింపు పొందిన ఆయన ఏకంగా చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ జమానాలో ఆయన నోటికి అదుపు లేకుండా పోయింది. ఏకంగా చంద్రబాబును చంపేస్తానంటూ రెచ్చిపోయిన అనిల్ కు కూటమి ప్రభుత్వం రాగానే చుక్కలు కనిపించాయి. ఆయనపై ఏకంగా రౌడీషీట్ నమోదు కావడంతో పాటు పదుల సంఖ్యలో కేసులు ఫైల్ అయ్యాయి.
తిప్పిన చోట తిప్పకుండా, కొట్టిన చోట కొట్టకుండా.. అన్నట్లు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మధ్యనే బెయిలుపై బయటకు వచ్చాడు అనిల్. ఇంతకాలం మౌనంగా ఉన్న వైసీపీ అతను తమవాడు కాదంటూ చేతులు దులుపుకొంది. అయితే తన గుండెల్లో జగన్ ఎప్పుడూ ఉంటాడని అనిల్ పలు ఇంటర్వ్యూలలో చెబుతున్నాడు. ఇప్పుడు ఏకంగా తాను ఎంపీ కావాలనే ఆకాంక్షను బయట పెట్టారు.
‘పార్లమెంట్అంటే నాకిష్టం. పది సంవత్సరాలు కేంద్ర మంత్రి వద్ద పనిచేశాను. పాసులు తీసుకుని పార్లమెంటుకు చాలాసార్లు వెళ్లాను. ఏడెమిదేళ్ళ నుంచి నాకు ఈ కోరిక ఉంది. నేను ఎప్పుడూ రాజకీయ లబ్ది కోసం పని చేయలేదు. దేవుడు అవకాశం ఇస్తే, ప్రజలు దీవిస్తే నా కల నెరవేరుతుంది. ప్రజలు కొత్త అనిల్ ను చూడబోతున్నారు..’ అని అనిల్ ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ కోరిక మనసులో పెట్టుకుని అనిల్ ఇంత కాలం వైసీపీకి అనుకూలంగా మాట్లాడారా..? చంద్రబాబు, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే జగన్ తనకు సీటు ఇస్తారని భావించారా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కొందరైతే ఏమో గుర్రం ఎగరా వచ్చు.. అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అదే రాజధాని ప్రాంతానికి చెందిన ఓ దళిత వ్యక్తి ఎంపీ కాలేదా..? అతను మాత్రం ఎందుకు కాకూడదు అనే వారు కూడా ఉన్నారు.
గతంలోనూ ఆయన ఎమ్మెల్యే టికెట్ కు, లేదంటే ఎంపీ టికెట్ కు ట్రై చేశారనే వార్తలు వినిపించాయి. ఆయన కార్యాలయంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలే) జెండా ఉండేది. ఇంకోపక్క జగన్ ఫోటో కూడా ఉండడం గమనార్హం. వైసీపీ కాదంటే కనీసం ఆర్పీఐఏ పార్టీ నుంచి అయినా ఆయన టికెట్ ఆశించి ఉండవచ్చు. గతంలో పలువులు ఎంపీలతో దిగిన ఫొటోలను తరచూ చూపిస్తుంటారని తోటివారు చెబుతుంటారు.
అంటే బోరుగడ్డ ఎంపీ కోరిక ఇప్పడిది కాదన్నమాట..! చంద్రబాబును తిట్టేస్తే జగన్ సీటు ఇస్తారనే భ్రమలో ఉన్నారేమో.. ఆ రోజుల్లో చెలరేగిపోయారు. ఇప్పుడు తన మనసులో మాట బయట పెట్టేశారు. మాటకు ముందు జగన్ పేరు జపించే బోరుగడ్డ వైసీపీ నుంచి ఎంపీ సీటును దక్కించుకుంటారా అంటే ఇప్పుడు ఆ అవకాశం అసలు లేదు. పోనీ తన చిరకాల కోరిక తీర్చుకోవడానికి మరేదైనా పార్టీ పంచన చేరతారా..? లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా..? అనేది చూడాలి.