తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త లెక్కలు వేస్తున్నారు. తెలంగాణ పేరు దేశదేశాల్లో మార్మోగాలన్నది ఆయన ఉద్దేశం. పెట్టుబడులు.. పరిశ్రమల రాకను అభిలషిస్తున్న సీఎం.. ఈ క్రమంలో కొత్తగా `తెలంగాణ బ్రాండింగ్`ను తీసుకువచ్చారు. తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచ వేదికపై కూడా సగర్వంగా నిలపాలన్నది ఆయన సంకల్పం. ఈ క్రమంలో వచ్చే నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుపై చాలానే ఆశలు పెట్టుకున్నారు.
ఈ సదస్సు ద్వారా భారీఎత్తున పెట్టుబడులు తీసుకురావాలన్నది సీఎం రేవంత్ సంకల్పంగా ఉంది. దీంతో ఇప్పుడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వ్యక్తులు, వ్యవహారాలకు పెద్ద పీట వేస్తున్నారు. వచ్చే నెలలో నిర్వహించే సదస్సులో వీటిని ప్రధానంగా వివరించాలన్నది సీఎం చేసిన ఆదేశం. తద్వారా తెలంగాణ ఉన్నతిని గుర్తించి.. పెద్ద ఎత్తున దేశ, విదేశీ పెట్టుబడి దారులు రాష్ట్రానికి క్యూ కడతారని ఆయన ఆశలు పెట్టుకున్నారు.
అయితే.. ఈ బ్రాండింగ్ ఎలా ఉన్నా.. రేవంత్ రెడ్డి ఆశలు నెరవేరుతాయా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. పాలనతో పాటు.. ఎదురవుతున్న అనేక సమస్యలు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయి. సైబర్ నేరాలు, డ్రగ్స్ వంటివి ప్రధాన సమస్యగా మారుతున్నాయి. తాజాగా కూడా 24 కోట్ల రూపాయల మోసాలకు సంబంధిం చిన ముఠా అరెస్టయింది. మరో 100 కోట్ల రూపాయల మేరకు మోసాలకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయి. ఇక, వారాంతాల్లో ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నా.. డ్రగ్స్ భూతం వెంటాడుతూనే ఉంది.
ఈ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అయితే.. దీనిపై కసరత్తు చేస్తున్నామని సర్కారు చెబుతున్నా.. ఆశించిన స్థాయిలో అయితే.. ఫలితం లభించడం లేదు. మరోవైపు నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, నీటి వివాదాలు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయి. రైజింగ్ తెలంగాణలో ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు సమయం ఉందని చెబుతున్నా.. పెట్టుబడి దారులకు ఇవి ప్రధాన ఇరకాటంగా మారనున్నాయి. పెట్టుబడులకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నా.. సమస్యల విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదన్న వాదన వినిపిస్తోంది.