రాజకీయ రంగప్రవేశానికి ముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడు నుంచి మొదటి ఆడియో సింగల్ వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ ఇంకా అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి తమిళ వర్షన్ రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ తనదైన స్టైల్ లో అభిమానులు ఊగిపోయే రేంజ్ లో ట్యూన్ ఇచ్చాడు. సాధారణ ప్రేక్షకులకు ఎలా అనిపిస్తుందనేది ఇంకొద్ది గంటలు ఆగితే క్లారిటీ వస్తుంది. ఈ మధ్య తన స్థాయి పాటలు ఇవ్వలేకపోతున్నాడని అనిరుధ్ మీద కామెంట్స్ ఉన్నాయి. కూలిలో కూడా మౌనికా ఒకటే క్లిక్ అయ్యింది. సో ఇప్పుడు జన నాయకుడు మీద అంచనాలతో పాటు ఒత్తిడి కూడా ఉంటుంది
పాట ఎలా ఉందనేది కాసేపు పక్కనపెడితే జన నాయకుడు ఎంతో కొంత భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం నెలల నుంచి జరుగుతూనే ఉంది. సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ లో నటుడు వీటి గణేష్ ఇదే విషయాన్ని నొక్కి చెబితే అనిల్ రావిపూడి మధ్యలో అడ్డుపడి ఏదో మేనేజ్ చేశాడు. ఇప్పుడీ సాంగ్ లో విజయ్, పూజా హెగ్డే, మమిత బైజు డాన్స్ చేయడం చూస్తుంటే బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల గుర్తుకు రావడంలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు. ఆ మధ్య వదిలిన టీజర్ లో విజయ్ ని పోలీస్ ఆఫీసర్ గెటప్ లో చూపించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే ఒక్కొక్క లింకు కనెక్ట్ అవుతుంది.
ఇన్ సైడ్ టాక్ అయితే భగవంత్ కేసరిలోని కేవలం మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకుని దర్శకుడు హెచ్ వినోత్ చాలా మార్పులు చేశాడట. వర్తమాన రాజకీయాలకు అనుగుణంగా పొలిటికల్ టచ్ కూడా ఇచ్చారని కోలీవుడ్ టాక్. ఒకవేళ అదే నిజమైతే విజయ్ చివరి సినిమాకు స్టోరీ లైన్ ఇచ్చిన ఘనత రావిపూడికి దక్కుతుంది. ఈ గాసిప్స్ లో ఎంతమేరకు వాస్తవం ఉందొ తేలాలంటే జనవరి 9 దాకా ఆగాల్సిందే. వాయిదా వార్తలు తిరుగుతున్న నేపథ్యంలో టీమ్ వాటికీ చెక్ పెడుతూ పోస్టర్లతో పాటు పాటలో కూడా రిలీజ్ డేట్ ని మళ్ళీ ఖరారు చేసింది. సో ప్రభాస్ రాజా సాబ్ తో ఫేస్ టు ఫేస్ క్లాష్ కు రంగం సిద్ధమైనట్టే.