రాజస్థాన్‌లో ఐటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక సీనియర్ ఆఫీసర్ ప్రద్యుమన్ దీక్షిత్ చేసిన స్కామ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకునే రెండు ప్రైవేట్ కంపెనీల నుంచి, అతని భార్య పూనమ్ దీక్షిత్ దాదాపు రెండేళ్లలో ఏకంగా రూ.37.54 లక్షలు ‘జీతం’ రూపంలో తీసుకుంది. షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ రెండేళ్లలో ఆమె ఆఫీసులకు ఒక్కసారి కూడా పని చేయడానికి వెళ్లలేదు.
ప్రద్యుమన్ దీక్షిత్ రాజ్‌కామ్ ఇన్ఫో సర్వీసెస్‌లో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ప్రభుత్వ టెండర్లు పాస్ చేయడానికి బదులుగా, ఒరియన్ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ అనే ఆ రెండు కంపెనీలను తన భార్యకు ఉద్యోగం ఇవ్వమని, నెలవారీ జీతం చెల్లించమని డైరెక్ట్ చేశారు. దీనికి సంబంధించిన డబ్బును పూనమ్ దీక్షిత్ ఐదు వేర్వేరు బ్యాంకు అకౌంట్‌లలోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది.
అసలు విషయం ఏమిటంటే, ఆ రెండు కంపెనీల్లో తన భార్య అటెండెన్స్ రిపోర్ట్‌లను ప్రద్యుమన్ దీక్షిత్ స్వయంగా అప్రూవ్ చేశారు. పూనమ్ దీక్షిత్ ఒకే సమయంలో రెండు కంపెనీల నుంచి జీతం తీసుకుంటున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఒరియన్ప్రో సొల్యూషన్స్‌లో ఫేక్ ఉద్యోగిగా ఉంటూనే, ట్రీజెన్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ నుంచి ‘ఫ్రీలాన్సింగ్’ పేరుతో కూడా ఆమె పేమెంట్లు తీసుకుంది.
జనవరి 2019 నుంచి సెప్టెంబర్ 2020 మధ్య కాలంలో ఈ రెండు కంపెనీలు పూనమ్ దీక్షిత్ అకౌంట్లకు మొత్తం రూ.37,54,405 ట్రాన్స్‌ఫర్ చేశాయి. ఇదంతా ‘జీతం’ కింద చూపించారు. అంటే, కేవలం ప్రభుత్వ టెండర్లను పాస్ చేయడానికి అధికారి తన పదవిని వాడుకుని, భార్య పేరు మీద డబ్బులు (లంచం) తీసుకున్నాడన్నమాట.
ఈ విషయంపై ఒక ఫిర్యాదుదారుడు రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో, ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. హైకోర్టు ఆదేశాల మేరకు యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) దీనిపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఒక ప్రభుత్వ అధికారి తన అధికారంతో, భార్యను ఉపయోగించి దాదాపు 38 లక్షలు సంపాదించడం అనేది అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. ఏసీబీ విచారణ తర్వాత ఈ స్కామ్‌లో ఎంతమంది ప్రమేయం ఉందో అనేది బయటపడనుంది.