hyderabadupdates.com movies మంచి సినిమాను చూడ‌రా… ఫ్యాన్స్ ఆక్రోశం

మంచి సినిమాను చూడ‌రా… ఫ్యాన్స్ ఆక్రోశం

కొన్ని సినిమాలకు రివ్యూలు, టాక్ అటు ఇటుగా ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర కొన్ని విషయాలు కలిసొచ్చి బాగా ఆడేస్తుంటాయి. స్థాయికి మించి విజయాన్ని అందుకుంటూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలకు మాత్రం టాక్ చాలా బాగున్నా, రివ్యూలూ పాజిటివ్‌గా వచ్చినా.. అనుకున్నంతగా ఆడవు. ఆ సినిమాలకు ఎందుకు అనుకున్నంత మేర వసూళ్లు రాలేదో అర్థం కాదు. టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రెండో కోవకే చెందుతుంది. రామ్ కథానాయకుడిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమిది. ఒక స్టార్ హీరోను ఆరాధించే వీరాభిమాని కథను చాలా హృద్యంగా తెరకెక్కించాడు మహేష్ బాబు. 

రామ్ కూడా ఈ సినిమాలో ఎంతో ఇన్వాల్వ్ అయ్యాడు. ఓ పాట రాశాడు. ఓ పాట పాడాడు. మేకింగ్ కూడా దగ్గరుండి చూసుకున్నాడు. ఇక తన పెర్ఫామెన్స్ గురించైతే చెప్పాల్సిన పని లేదు. కెరీర్లోనే వన్ ఆఫ్ ద ది బెస్ట్ అనదగ్గ స్థాయిలో నటించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రాజీ లేకుండా నిర్మించింది. ఈ సినిమాలో సాంకేతిక విభాగాలు కూడా మంచి ఔట్ పుట్ ఇచ్చాయి. హీరోయిన్ భాగ్యశ్రీ కూడా అందం, అభినయంతో మెప్పించింది. కానీ ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. వరల్డ్ వైడ్ తొలి వీకెండ్లో ఈ సినిమా రూ.20 కోట్ల మేర నెట్ వసూళ్లు రాబట్టింది. ఇవి పర్వాలేదనిపించే వసూళ్లే. కానీ ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడితో పోలిస్తే కలెక్షన్లు తక్కువే.

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ టైమింగ్ సరిగా లేదని.. నవంబరులో ఏ సినిమాలకూ ఎక్కువ వసూళ్లు రావనే చర్చ జరుగుతోంది. పైగా ఈ నెలలో గర్ల్ ఫ్రెండ్, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలను జనం బాగా చూశారని.. వచ్చే వారం ‘అఖండ-2’ రాబోతుండడతో దాని కోసం డబ్బులు దాచుకుని, వెయిట్ చేస్తున్నారని.. అందుకే ముందు వారం వచ్చిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు సరైన ఆదరణ దక్కలేదని అంటున్నారు.

రామ్ వరుసగా ఫ్లాపులు ఇవ్వడం, పైగా చివరి చిత్రం ఏడాదిన్నర ముందు రిలీజ్ కావడం.. అతడికి మాస్‌లోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉండడంతో ఈ క్లాస్ సినిమా పట్ల వారికి ఆసక్తి లేకపోవడం లాంటి అంశాలు మైనస్ అయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే కారణాలు ఏవైనప్పటికీ.. రామ్ ఓ మంచి సినిమా చేస్తే ఆదరించరా అంటూ సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘టీఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్’ అనే ట్యాగ్‌ను ఈ సినిమాకు తగిలిస్తున్నారు.

Related Post