కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్న ఒక ఈవెంట్‌లో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు వేదికపైనే గొడవ పడటం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో, ఆ ఇద్దరు ఆఫీసర్లు ఒకరినొకరు తోసుకోవడం, గిల్లుకోవడం వంటివి చేయడంతో, పక్కనే ఉన్న గడ్కరీ కూడా షాకైనట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. సర్వీసులో సీనియర్ హోదాల్లో ఉన్న అధికారులు ఇలా పబ్లిక్‌గా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
ఈ గొడవకు కారణం అడ్మినిస్ట్రేటివ్ కన్ఫ్యూజన్ అని తెలుస్తోంది. ఇందులో పాల్గొన్న ఇద్దరిలో ఒకరు నాగ్‌పూర్ రీజియన్ మాజీ పోస్ట్‌మాస్టర్ జనరల్ కాగా, మరొకరు ఆమె ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత అదనపు బాధ్యతలు తీసుకున్న ఆఫీసర్. మాజీ పోస్ట్‌మాస్టర్ జనరల్ తన ట్రాన్స్‌ఫర్ ఆర్డర్‌ను కోర్టులో సవాలు చేసి, స్టే తెచ్చుకున్నారు. దీంతో, పోస్ట్‌మాస్టర్ జనరల్ బాధ్యతలు ఎవరు నిర్వహించాలి అనే విషయంలో అధికార పోరాటం జరిగినట్లు తెలుస్తోంది. ఈ బ్యూరోక్రటిక్ గొడవే వేదికపై బహిరంగంగానే బయటపడింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు మహిళా అధికారులు ఒకే సోఫాలో కూర్చుని, స్పేస్ కోసం ఒకరినొకరు తోసుకుంటూ, గిల్లుకుంటూ వాదిస్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత ఒకరు ఇంకొకరి చేతిని గిల్లడం కూడా జరిగింది. ఈ మొత్తం తతంగం వేదికపై అతిథులు, కింద ప్రేక్షకులు చూస్తుండగా జరగడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించింది.
ఇక ఈ సంఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు వృత్తిపరమైన మర్యాదలు పాటించకపోవడంపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సంఘటనపై పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. వీడియో వైరల్ కావడంతో, ఈ గొడవకు దారితీసిన అడ్మినిస్ట్రేటివ్ సమస్యపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సిన ఒత్తిడి పెరిగింది. ఇక అధికారిక పదవులు, బదిలీల విషయంలో ఉన్న అంతర్గత విభేదాలు ఇలా బయటపడడం మర్యాద కాదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఈ వ్యవహారంపై డిపార్ట్‌మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.