తిరుపతి : శ్రీవారి భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ప్రసారాలను విస్తరించనున్నట్లు టిటిడి జేఈవో (వైద్యం, విద్య), ఇంఛార్జి సీఈవో డా. ఎ. శరత్ స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కార్యాలయానికి వచ్చిన ఆయన, వివిధ శాఖల ప్రతినిధులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజువారీ కార్యక్రమాల ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక భావం పెంపొందేలా కార్యక్రమాలను మరింత ఆకర్షణీయంగా రూపొందించాలని సూచించారు. “శతమానంభవతి” కార్యక్రమాన్ని క్రమబద్ధీకరించి ప్రతి భక్తునికీ శ్రీవారి ఆశీర్వచనం, అక్షింతలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. “దివ్యానుభూతి” కార్యక్రమాన్ని మరింత సులభంగా, అందరికీ చేరువగా తీసుకువస్తామని చెప్పారు.
సోషల్ మీడియా వేదికల ద్వారా ఆకర్షణీయమైన భక్తి కార్యక్రమాలు, భక్తుల అనుభవాలను, ఇతర కార్యక్రమాలను మరింత విస్తృతంగా భక్తులకు చేరవేయనున్నట్లు తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాలను మరింత నాణ్యంగా అందిస్తామని పేర్కొన్నారు. ఎస్వీబీసీ ద్వారా శ్రీవారి నిత్యసేవలు, ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ భక్తులకు ఆధ్యాత్మికానుభూతి కలిగిస్తున్నామని తెలిపారు. వేదాలు, ఉపనిషత్తులు, సనాతన ధర్మాన్ని విస్తరించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడంతో పాటు, శ్రీవారి వైభవాన్ని మరింత పేరొందిన పండితుల వ్యాఖ్యానాల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం కార్యాలయంలో ప్రసారాల రూపకల్పన, రికార్డింగ్, కంటెంట్, కెమెరాలు, ఆడియో మిక్సింగ్, డైలీ ప్రోగ్రామ్ చార్ట్ వంటి అంశాలను పరిశీలించి, అన్ని వివరాలు క్రమబద్ధంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
The post మరింత జనరంజకంగా ఎస్వీబీసీ ప్రసారాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
మరింత జనరంజకంగా ఎస్వీబీసీ ప్రసారాలు
Categories: