hyderabadupdates.com movies మ‌రో 30 రోజులే గ‌డువు.. జిల్లాల వ్యూహం ఏమ‌వుతుంది ..!

మ‌రో 30 రోజులే గ‌డువు.. జిల్లాల వ్యూహం ఏమ‌వుతుంది ..!

రాష్ట్రంలో జిల్లాల విభజన, డివిజన్‌ల‌ విభజన, అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటు అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. అయితే, దీనికి సంబంధించిన సమయం మరో 30 రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 20 కల్లా కొత్త జిల్లాల‌ సరిహద్దులను లేదా కొత్త డివిజన్ల‌ సరిహద్దులను నిర్ణయించాల్సిన అవసరం ఏర్పడింది. డిసెంబర్ 21వ తేదీ తర్వాత ఇక జిల్లాల సరిహద్దులు, మండలాల సరిహద్దులు, డివిజన్ల‌ సరిహద్దులు మార్చడానికి వీలు లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లోని గణాంకాల శాఖ స్పష్టం చేసింది.

దీని ప్రకారం మరో 30 రోజులు మాత్రమే ప్రభుత్వానికి జిల్లాల విషయంలో సమయం కనిపిస్తుంది. కానీ, ఇప్పటికీ చాలావరకు జిల్లాల విభజన అదేవిధంగా మండలాల సరిహద్దుల మార్పు వంటి విషయంలో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కాపురం, మదనపల్లె జిల్లాలను కొత్తగా ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అక్కడ నుంచి కూడా అనేక మార్పులు చేర్పులు చేయాలని విజ్ఞాపనలు అందుతున్నాయి. అదే సమయంలో రాజంపేట జిల్లాను ప్రకటించాలన్న డిమాండ్ తెర‌ మీదకు వచ్చింది.

ఇది అత్యంత కీలకమైన డిమాండ్‌. ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాలో కీలకమైన రాజంపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిడిపి విజయం సాధించింది. రాజంపేట‌ను జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టిస్తే.. మొత్తం కడప జిల్లా పై ప్రభావం చూపించి వచ్చే ఎన్నికల నాటికి టిడిపి పుంజుకునే అవకాశం ఉంటుందన్న చర్చ కొనసాగుతోంది. కానీ ఈ విషయంలో ఇంకా అసలు ప్రక్రియ ప్రారంభం కాలేదు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో కొంత భాగాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడం, జిల్లాలకు పేర్లు మార్పు ఇలా రకరకాల అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి.

అనేక డిమాండ్లు పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం దాదాపు రెండువేల కుపైగా విజ్ఞాపనలు, విన్నపాలు పెండింగ్‌లోనే ఉన్నాయని అధికారులే చెబుతున్నారు. ఏ విధంగా జిల్లాలను విభజిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం చూస్తే సీఎం చంద్రబాబు చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. రెండు మూడు రోజుల్లోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్త‌న్నారు. అనంతరం శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో జిల్లాల విభజనకు ఏ మేరకు ఆయన సమయం కేటాయిస్తారు ఎంతవరకు వీటిలో సక్సెస్ అవుతారు అనేది చూడాలి. ఈ విషయంలో ఆద‌రా బాద‌రాగా చేస్తే మళ్ళీ వైసిపి హయాంలో వచ్చినటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Related Post