కొండంత ఆశలు పెట్టుకుంటే గోరంత కూడా నెరవేర్చలేకపోయిన రాజా సాబ్ చరిత్ర గతమే అయినా దానికి సంబంధించిన జ్ఞాపకాలు ప్రభాస్ అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ముఖ్యంగా ముందు రోజు రాత్రి నైజామ్ ప్రీమియర్ షోల విషయంలో జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. హైదరాబాద్ విమల్ థియేటర్ దగ్గర మిడ్ నైట్ ఎదురుకున్న అనుభవాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. నిన్న మైత్రి డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు చూసే శశి దానికి క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇస్తుందనే ఉద్దేశంతోనే రాజా సాబ్ ప్రీమియర్లను తెలంగాణ మొత్తం ప్లాన్ చేశారు పంపిణీదారులు. అయితే టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు సంబంధించి వేరే అయిదు కేసులు కోర్టులో పెండింగ్ ఉన్న విషయం ఆలస్యంగా తెలిసింది. వాటిని క్లియర్ చేసే బాధ్యత తీసుకుని కొట్టివేయించే లోగా రిలీజ్ డేట్ ముంచుకొచ్చేసింది. కేసులను న్యాయస్థానం కొట్టేసి వాటి ఉత్తర్వులను ప్రభుత్వాధికారులకు ఇచ్చి విన్నపాలు చేసుకునే లోగా రాత్రి అయిపోయింది. దీంతో రేట్లు రాలేదు.
టికెట్లు ఇస్తారని ముందే ప్రచారం జరగడంతో వందలాదిగా ఫ్యాన్స్ థియేటర్లలో గుమికూడారు. కానీ చివరి నిమిషం దాకా వేస్తామనే ఆశ ఎగ్జిబిటర్లది. అలా ఒత్తిడి పెరిగిపోయి ఏకంగా రద్దు చేసే దాకా పరిస్థితి చేజారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో జాగ్రత్తగా ఉన్నారు నిర్మాతలు. జిఓ కోసం వెయిట్ చేయడం కంటే రెగ్యులర్ రేట్లతో టికెట్ అమ్మకాలు చేయడం శ్రేయస్కరమని భావించి వెంటనే దాన్ని అమలు చేశారు.
ఇలా రాజా సాబ్ రాత్రి కేవలం అభిమానులకే కాదు బయ్యర్లకు కూడా మర్చిపోలేని కాళరాత్రిగా మిగిలిపోయింది. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా ఏం చేయాలనే దాని గురించి ఆలోచన చేస్తామని శశి అంటున్నారు. మైత్రి భాగస్వామ్యంలో రూపొందిన పెద్ది ఏప్రిల్ 30 విడుదల కానుంది. దీనికి ఖచ్చితంగా హైక్స్ కావాల్సిందే. రెగ్యులర్ రేట్లతో పనవ్వదు. అలా కాకూడదనుకుంటే కనీసం రెండు వారాల ముందు నుంచే ఈ పెంపుల వ్యవహారం గురించి అప్లికేషన్ పెట్టుకోవడం బెటర్.