hyderabadupdates.com movies మళ్ళీ టిల్లుగా మారాల్సిందేనా?

మళ్ళీ టిల్లుగా మారాల్సిందేనా?

ఒక క్యారెక్టర్ ఆ హీరో కోసమే పుట్టిందా అనిపించేలా అది అద్భుతంగా క్లిక్ అయితే.. ఆ క్యారెక్టర్‌ను ప్రేక్షకులు అమితంగా ఇష్టపడి బాగా ఓన్ చేసుకుంటే.. ఆ పాత్ర కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటే.. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని విజయాన్ని అందుకుంటే.. ఆ హీరో చేసే తర్వాతి సినిమాల మీద ఒక రకమైన నెగెటివ్ ప్రభావం పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇందుకు ఉదాహరణ.. డీజే టిల్లు. దీని కంటే ముందు ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో మెప్పించినప్పటికీ.. సిద్ధుకు టిల్లు పాత్రతో వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. 

ఆ సినిమా సర్ప్రైజ్ హిట్ కాగా.. రిలీజ్ తర్వాత ఆ పాత్ర ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మరింతగా జనాలకు చేరువైంది. ఓటీటీలో కూడా సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో ‘టిల్లు స్క్వేర్’కు ఎక్కడ లేని హైప్ వచ్చింది. ఆ హైప్‌కు తగ్గట్లే సినిమా కూడా ఏకంగా రూ.130 కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. రెండోసారి టిల్లు పాత్రతో మరింతగా దూసుకెళ్లిపోయాడు సిద్ధు.

ఐతే టిల్లు పాత్ర విషయంలో సిద్ధు కంటే ప్రేక్షకులే ఎక్కువ హ్యాంగోవర్‌లోకి వెళ్లిపోయారేమో అనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. ‘జాక్’లో సాధారణ పాత్రలో సిద్ధును ఆడియన్స్ తట్టుకోలేకపోయారు. లేటెస్ట్‌గా ‘తెలుసు కదా’ మూవీలో సిద్ధు కొంచెం భిన్నమైన పాత్ర చేశాడు. వరుణ్ క్యారెక్టర్‌లో అదిరిపోయే పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. టిల్లు పాత్ర నుంచి బయటికి రావడానికి శక్తి వంచన లేకుండా కష్టపడ్డాడు. ఈ సినిమాకు తన పాత్ర, నటనే ప్రధాన ఆకర్షణ. కానీ తన కష్టం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. 

మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర కోరుకున్న విజయాన్ని దక్కించుకోలేకపోయింది ‘తెలుసు కదా’. దీంతో ఆడియన్స్ చూపు మళ్లీ ‘టిల్లు’ మీదే పడింది. సిద్ధుకు అదే కరెక్ట్ క్యారెక్టర్ అని.. ఇక ‘టిల్లు క్యూబ్’ మీద ఫోకస్ చేయాల్సిందే అని కోరుకుంటున్నారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ దర్శకుడు రవికాంత్ పేరెపుతో సిద్ధు చేస్తున్న ‘బడాస్’ సిద్ధుకు మళ్లీ బ్రేక్ ఇవ్వొచ్చన్న అంచనాలున్నప్పటికీ.. తన ఫ్యాన్స్ మాత్రం ‘టిల్లు క్యూబ్’ కోసమే ఎక్కువ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర్‌తో ‘టిల్లు క్యూబ్’ను మొదలుపెట్టబోతున్నాడు సిద్ధు. ఇందుకోసం సిద్ధు మళ్లీ రైటర్ అవతారం కూడా ఎత్తబోతున్నాడు.

Related Post