ప్రస్తుతం ‘జైలర్-2’లో నటిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. దాని తర్వాత తన చిరకాల మిత్రుడు కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి కమిటైన సంగతి తెలిసిందే. ఈ లెజెండరీ కాంబినేషన్ విషయంలో అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఐతే ఈ చిత్రాన్ని ముందుగా సీనియర్ దర్శకుడు సుందర్.సి చేతిలో పెట్టారు. కానీ పది రోజులు తిరక్కముందే తానీ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు సుందర్. దీంతో మళ్లీ కొత్తగా దర్శకుడి వేట మొదలైంది. ముందు ఈ ప్రాజెక్టుకు లోకేష్ కనకరాజ్ పేరు వినిపించగా.. ‘కూలీ’ ఫ్లాప్ కావడంతో అతడ్ని పక్కన పెట్టేశారు.
ఇప్పుడేమో రామ్ కుమార్ అనే యువ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అతను పార్కింగ్ అనే చిన్న సినిమా తీశాడు. ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఐతే అలాంటి చిన్న సినిమా, పైగా క్లాస్ టచ్ ఉన్న మూవీ తీసిన వాడు రజినీ మూవీని డీల్ చేయగలడా అనే సందేహాలు కలుగుతున్నాయి.
నిజానికి రామ్ కుమార్ కంటే ముందు రజినీ, కమల్.. ధనుష్ పేరును కూడా పరిశీలించారట. రజినీకి ధనుష్ అల్లుడుగా ఉన్నపుడే ఆయన్ని డైరెక్ట్ చేయడం కోసం ఒక కథ రెడీ చేసుకున్నాడు. కానీ అప్పుడా ప్రాజెక్టు సాధ్యపడలేదు. తర్వాత రజినీ కూతురు ఐశ్వర్య నుంచి ధనుష్ విడిపోవడం.. నటుడిగా, దర్శకుడిగా ఫుల్ బిజీ అయిపోవడం జరిగింది. ఐతే కమల్ నిర్మాణంలో రజినీ సినిమా చేయాలనుకుని దర్శకుల పేర్లు పరిశీలించినపుడు ధనుష్ పేరు కూడా తెరపైకి వచ్చిందట.
కానీ తన దగ్గర కథ ఉన్నప్పటికీ తన కమిట్మెంట్ల దృష్ట్యా వెంటనే ఈ ప్రాజెక్టును టేకప్ చేయలేని స్థితిలో ఉన్నాడు ధనుష్. దీంతో సుందర్ వైపు చూశారు. ఆయన అనుకోకుండా ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకు ధనుష్.. రజినీతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడట. కానీ రజినీ, కమల్.. రామ్ కుమార్‌తో చర్చలు మొదలుపెట్టడం, ఈ కాంబినేషన్ దాదాపుగా ఓకే అయిపోవడంతో ధనుష్‌తో సినిమా చేయడానికి రజినీ సుముఖత వ్యక్తం చేయలేదని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.