మన శంకరవరప్రసాద్ గారు నుంచి మీసాల పిల్ల వీడియో ప్రోమో వచ్చినప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నాడు. ట్యూన్ క్యాచీగా ఉన్నప్పటికీ కేవలం ఒక్క లైనే ఉండటం, కాస్ట్యూమ్స్ ప్లస్ బ్యాక్ గ్రౌండ్ మీద కొంత నెగటివ్ టాక్ వినిపించడం సోషల్ మీడియాలో కనిపించింది. ఇవాళ ఫుల్ సాంగ్ వదిలేశారు. సంక్రాంతికి వస్తున్నాంలో గోదారి గట్టు మీద రామ చిలకవేకు పని చేసిన టీమే ఇందులోనూ పాలు పంచుకుంది. భాస్కరభట్ల సాహిత్యానికి భీమ్స్ సిసిరోలియో కంపోజింగ్ లో ఈసారి రమణ గోగుల బదులు ఉదిత్ నారాయణ్ వచ్చారు. మధుప్రియ స్థానంలో శ్వేతా మోహన్ గాత్రం ఇచ్చారు.
భార్య భర్తల మధ్య గొడవలు, కోపాలు తాపాలు, విడిచి వెళ్లిపోయిన సతీమణి కోసం మగాడు పడే తిప్పలు అన్నీ చాలా క్యూట్ గా వర్ణించారు భాస్కరభట్ల. ఖరీదైన ఇంటీరియర్ లో షూట్ చేయడం వల్ల రిచ్ లుక్ ఉంది. అయితే ఫ్యాన్స్ ఎదురు చూసిన చిరంజీవి వింటేజ్ స్టెప్స్ ని డాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కంపోజ్ చేసిన తీరు సింపుల్ గా ఉన్నా స్వీట్ గా అనిపించింది. డెబ్భై ఏళ్ళ వయసులో మెగాస్టార్ నుంచి ఇంతకన్నా ఎక్కువ గ్రేస్ ఆశిస్తే అత్యాశే. ఆయనతో నయనతార కెమిస్ట్రీ బాగా పండింది. సైరాలో భార్యాభర్తలుగా, గాడ్ ఫాదర్ లో అన్నా చెల్లెలుగా నటించిన చిరు నయన్ ఈసారి విడిపోయిన కపుల్ గా మారారు.
మొత్తంగా చెప్పాలంటే స్లో పాయిజన్ లా ఈ మీసాల పిల్ల జనాలకు కనెక్ట్ కావడం ఖాయం. ఇప్పటికే బోలెడు రీల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఫుల్ సాంగ్ వచ్చింది కాబట్టి ఇవి మరిన్ని పెరగబోతున్నాయి. ఇంకా విడుదల తేదీ ఖరారు చేయని మన శంకరవరప్రసాద్ గారు జనవరి 12 ఆప్షన్ పరిశీలనలో పెట్టింది. కన్ఫామ్ చేయలేదు. ఈ నెల 21 వెంకటేష్ కీలక షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్నారు. నవంబర్ చివరికల్లా మొత్తం పూర్తి చేసే సంకల్పంతో ఉన్న అనిల్ రావిపూడి డిసెంబర్ మొత్తం ప్రమోషన్ల కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎలాంటి వాయిదాలు పడే సూచనలు అయితే ముమ్మాటికీ లేవు.