చిన్న సినిమాలకు ప్రమోషన్లు ఎంత చేసుకున్నా సోషల్ మీడియా ద్వారా అది స్ప్రెడ్ కావడం ముఖ్యం. లిటిల్ హార్ట్స్ కి ఇది చాలా ఉపయోగపడింది. మౌళి లాంటి కొత్త కుర్రాడు హీరోగా ఉన్నా సరే ముందు రోజే షోలు వేయడం ద్వారా ఒక్క రాత్రిలోనే బజ్ పెరిగేలా చేసుకోవడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మిత్ర మండలికి అదే ఫార్ములా వాడబోతున్నారు. అక్టోబర్ 16 మెయిన్ రిలీజ్ డేట్ కాగా 15 సాయంత్రం లేదా రాత్రి ప్రీమియర్లు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పోటీలో ఉన్నవన్నీ యూత్ మూవీసే కావడంతో జనాన్ని ఆకర్షించడం ఒక పెద్ద సవాల్ గా మారిపోయింది. అందుకే ఈ ప్లాన్ చేశారు.
జాతిరత్నాలు టైపు కామెడీలా అనిపిస్తున్నప్పటికీ ట్రీట్మెంట్, ట్విస్టులు, కామెడీ చాలా డిఫరెంట్ గా ఉంటాయని నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాస్, దర్శకుడు విజయేందర్ చెబుతున్నారు. రెండింటిలోనూ ప్రియదర్శి ఉండటం వల్ల పోలిక ఎక్కువ హైలైట్ అవుతోంది. ఒకపక్క కె ర్యాంప్ ప్రమోషన్లలో దూసుకుపోతుండగా డ్యూడ్ మీద యూత్ లో ఆసక్తి బాగానే కనిపిస్తోంది. తెలుసు కదాని సైలెంట్ కిల్లర్ గా ప్రమోట్ చేస్తున్నారు. కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ స్పీడ్ మన దగ్గర ఇంకా పూర్తిగా తగ్గలేదు. సో అన్ని వైపులా చక్రబంధంలా ఉండటంతో మిత్ర మండలికి రిస్క్ మాములుగా లేదు. అందుకే ప్రీమియర్ల ప్లాన్.
ఈసారి సంక్రాంతి రేంజ్ లో దీపావళికి పోటీ వాతావరణం ఏర్పడటం గమనార్హం. అసలు విడుదల తేదీకి ముందే ప్రీమియర్లు చూసే అవకాశాన్ని ఈ మధ్య యువత ప్రత్యేకంగా ఫీలవుతున్నారు. మిరాయ్ సైతం ఈ రూట్ ఫాలో అయ్యిందే. మరి మిత్ర మండలికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ట్రేడ్ అభిప్రాయమైతే వీటిలో ఒకటో రెండో నెక్స్ట్ వీక్ కి వచ్చి ఉంటే థియేటర్ ఆక్యుపెన్సీలు మరింత మెరుగ్గా వచ్చేవనే కోణంలో ఉంది. గత ఏడాది ఒకే సీజన్ లో క, లక్కీ భాస్కర్, అమరన్ మూడూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి కాబట్టి ఈసారీ అదే రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాయి బయ్యర్ వర్గాలు. చూడాలి ఏం జరగనుందో.