లెజెండరీ నటుడు మోహన్ బాబు ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా తాను చేసిన ప్రతి పాత్రతోనూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారాయన. కానీ గత రెండు దశాబ్దాలుగా ఆయన ప్రతిభను టాలీవుడ్ సరిగా ఉపయోగించుకోలేదు. స్వయంగా మోహన్ బాబు కూడా సరైన సినిమాలు చేయక.. ఎక్కువ సమయం సినిమాలకు దూరంగా ఉంటూ తన అభిమానులను నిరాశకు గురి చేశారు.
కానీ ఆయన చాన్నాళ్ల తర్వాత తన అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే నిర్ణయం తీసుకున్నారు. నేచురల్ స్టార్ నాని సినిమాలో విలన్ పాత్రకు ఓకే చెప్పి ఆశ్చర్యపరిచారు. ‘ది ప్యారడైజ్’ సినిమాలో ఆయన చేస్తున్న విలన్ పాత్ర అందరిలోనూ ఎగ్జైట్మెంట్ పెంచింది. ఈ పాత్ర ఫస్ట్ లుక్స్‌కు అదిరిపోయే స్పందన వచ్చింది. దీనికి ఫాలో అప్‌గా మోహన్ బాబు మరో పాత్రను ఓకే చేయడం విశేషం.
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరోగా రాబోతున్న జయకృష్ణ సినిమాలో మోహన్ బాబు నటించబోతున్న విషయం ఖరారైంది. ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’ తర్వాత అజయ్ భూపతి డైరెక్ట్ చేయబోతున్న చిత్రమిదే. ఈ సినిమాకు ‘శ్రీనివాస మంగాపురం’ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు.
జయకృష్ణ డెబ్యూ కంటే ఈ చిత్రంలో మోహన్ బాబు నటించనుండడమే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఇందులోనూ ఆయనది విలన్ రోలే అయ్యుండొచ్చని భావిస్తున్నారు. మోహన్ బాబు లాంటి లెెజెండరీ నటుడిని ఢీకొట్టే హీరో అంటే దానికి మంచి ఎలివేషనే రావచ్చు. శ్రీనివాస మంగాపురం అన్నది తిరుపతి శివార్లలోని ఒక ఊరు. దాంతో మోహన్ బాబుకు గొప్ప అనుబంధమే ఉంది. ఆయన నెలకొల్పిన ‘విద్యా నికేతన్’ విద్యా సంస్థలు ఉన్నది అక్కడే. మరి మోహన్ బాబుకు అనుబంధం ఉన్న ఊరి పేరునే సినిమాకు టైటిల్‌గా పెట్టి అందులో ఆయనతో ఒక కీలక పాత్ర చేయించడం అంటే అజయ్ భూపతి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడన్నమాట.