యల్లమ్మ.. టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి వార్తల్లో ఉన్న సినిమా. ‘బలగం’ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచిన కమెడియన్ వేణు.. తన రెండో సినిమాగా ‘యల్లమ్మ’ తీయాలనుకున్నాడు. ముందు నేచురల్ స్టార్ నానిని ఈ సినిమాకు హీరోగా అనుకున్నారు. నిర్మాత దిల్ రాజు సైతం ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. కానీ కథల విషయంలో ఒక పట్టాన సంతృప్తి చెందని నాని.. కొన్నాళ్ల ప్రయాణం తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. తర్వాత నితిన్ దగ్గరికి ఈ కథ వెళ్లింది. అతను ఒక ఏడాది పాటు వేణుతో ట్రావెల్ చేశాడు.
ఇది పెద్ద బడ్జెట్ మూవీ కావడంతో నితిన్ ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటపడి కొంచెం కుదురుకుంటాడేమో అని ఎదురు చూశారు. కానీ గత ఏడాది చివర్లో ‘రాబిన్ హుడ్’తో షాక్ తిన్న నితిన్.. ఇటీవల ‘తమ్ముడు’తో ఇంకా పెద్ద ఎదురు దెబ్బ తిన్నాడు. తన బేనర్లోనే చేసిన ‘తమ్ముడు’ పెద్ద హిట్టయిపోతుందని.. ఆ తర్వాత నితిన్‌తో ‘యల్లమ్మ’ తీద్దామని ప్లాన్ చేసుకున్న రాజు.. ఆ సినిమా తేడా కొట్టడంతో వెనక్కి తగ్గాడు. నితినేమో.. విక్రమ్ కుమార్ సినిమా వైపు మళ్లాడు. దీంతో వేణుకు మళ్లీ వెతుకులాట తప్పలేదు. ఐతే ఎట్టకేలకు అతను తన సినిమాకు హీరోను ఖాయం చేసుకున్నట్లు సమాచారం.
లేటెస్ట్‌గా ‘కిష్కింధపురి’తో హిట్టు కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. ‘యల్లమ్మ’లో లీడ్ రోల్ చేయబోతున్నాడన్నది తాజా కబురు. దిల్ రాజే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. శ్రీనివాస్‌కు ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ ఉండడం ప్లస్ పాయింట్. ‘యల్లమ్మ’ను పాన్ ఇండియా మూవీగానే చేయాలనుకుంటున్నారు. నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారనే నమ్మకం టీంలో ఉంది. పైగా శ్రీనివాస్‌తో సినిమా అంటే.. ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ ఫినాన్షియల్ బ్యాకప్ కూడా ఇస్తాడు. మంచి కథ కావడంతో శ్రీనివాస్ కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.