ఏడేళ్ల ముందు ‘కేజీఎఫ్’ అనే సినిమా రాకముందు వరకు యశ్ అంటే కన్నడలో ఒక మిడ్ రేంజ్ హీరో. ఇతర భాషల ప్రేక్షకులకు అతడి గురించి పరిచయమే లేదు. కానీ ‘కేజీఎఫ్’ అనే చిత్రం పాన్ ఇండియా స్థాయిలో పెద్ద బ్లాక్ బస్టర్ అయి తన ఫాలోయింగ్‌ను అమాంతం పెంచేసింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘కేజీఎఫ్-2’ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయి యశ్‌ను పాన్ ఇండియా సూపర్ స్టార్లలో ఒకడిగా చేసింది.
ఐతే ఈ రెండు చిత్రాలతో యశ్ ఇమేజ్ మారిపోయి, తన మీద అంచనాలు పెరిగిపోవడంతో తర్వాతి సినిమాను ఎంచుకోవడం అతడికి సవాలుగా మారింది. ఎన్నో కథలు విని.. పలువురు దర్శకులను పరిశీలించి.. చివరికి మలయాళ ఫిలిం మేకర్ గీతు మోహన్ దాస్‌తో అతను జట్టు కట్టాడు. ఈ సినిమా గత ఏడాది మొదలైంది. సుదీర్ఘ కాలంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది మార్చి 19న ‘టాక్సిక్’ రిలీజ్ కావాల్సి ఉంది.
ఐతే ‘టాక్సిక్’ నుంచి ఇప్పటిదాకా ఒక చిన్న టీజర్ మాత్రమే వదిలారు. కానీ అది అంచనాలను అందుకోలేకపోయింది. టీజర్ క్లిక్ కాకపోవడం, తిరుగులేని మాస్ ఇమేజ్ తెచ్చుకున్న యశ్‌ను ఒక మహిళా దర్శకురాలు డైరెక్ట్ చేస్తుండడంతో సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అని అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు రీషూట్ల మీద రీషూట్లు జరుగుతున్నాయని.. దర్శకురాలి పనితనం నచ్చక యశ్‌యే డైరెక్షన్ చేస్తున్నాడని.. సినిమా బాగా ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ అసాధారణంగా పెరిగిపోయిందని.. ఇలా ఇటీవల అనేక ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.
అందువల్లే సినిమా నుంచి కొత్త అప్‌డేట్స్ కూడా ఏమీ రావట్లేదని అంటున్నారు. క్రమక్రమంగా ‘టాక్సిక్’ గురించి నెగెటివ్ ప్రచారాలు పెరిగిపోతున్నాయి. బజ్ తగ్గిపోతోంది. వీటన్నింటికీ తెరదించాలి, సినిమాకు బజ్ పెంచాలి అంటే ఒక బలమైన ప్రోమో ఒకటి రిలీజ్ చేయాల్సిన అవసరముంది. అలా చేస్తే తప్ప మళ్లీ సినిమాకు హైప్ తేవడం కష్టం.