ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. కానీ.. ఆయన అనుచరులు, పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు గాయపడ్డారు. వాహనాలపై రాళ్లు పడడంతో అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో హుటాహుటిన గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.
ఏం జరిగింది?
శ్రీరామనవమిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరిజిల్లాలోని ఆకివీడులో ఉన్న పెద్దరామాలయానికి డిప్యూటీ స్పీకర్ రఘురామ వచ్చారు. అయితే.. ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న కొంత మంది క్రిస్టియన్ సంఘాలకు చెందిన వారు.. నిరసన వ్యక్తం చేశారు. తమ వర్గాన్ని కించపరుస్తున్నారని.. దూషి స్తున్నారని ఆరోపిస్తూ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే.. రఘురామ ఈ నిరసనలను పట్టించుకోకుండా.. ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన క్రిస్టియన్ సంఘాల్లోని కొందరు యువత తమ వెంట తెచ్చుకున్న మేకులు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని.. వారు కూడా రెచ్చగొట్టారని కూటమి పార్టీలకు చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆయన పనేనా?
ఇదిలావుంటే.. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్ పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రమేయంతోనే ఈ దాడి జరిగి ఉంటుందని రఘురామ వర్గీయులు చెబుతున్నారు.
గతంలో రఘురామను కస్టడీలో టార్చర్ చేసిన వ్యవహారంలో సునీల్‌కుమార్‌పై కేసు ఉంది. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి ఇరువురి మధ్య వాగ్యుద్ధం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన దాడి వెనుక ఆయన ప్రమేయం ఉందన్న సందేహాలు వస్తున్నాయి.