సౌత్ ఇండియాలో ఎన్నో దశాబ్దాల నుంచి దర్శకులు అవుతున్న వాళ్లంతా తప్పక ఒక్క సినిమా అయినా చేయాలని ఆశించే హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు ముందు వరుసలో ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి హీరో కొత్త సినిమాకు ఇప్పుడు సరైన దర్శకుడు దొరక్క ఇబ్బంది పడడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రస్తుతం ‘జైలర్-2’లో నటిస్తున్న సూపర్ స్టార్.. దాని తర్వాత తన చిరకాల మిత్రుడు కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి కమిటైన సంగతి తెలిసిందే.
ఈ లెజెండరీ కాంబినేషన్ విషయంలో అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఐతే ఈ చిత్రాన్ని ముందుగా సీనియర్ దర్శకుడు సుందర్.సి చేతిలో పెట్టారు. కానీ పది రోజులు తిరక్కముందే తానీ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు సుందర్. దీంతో మళ్లీ కొత్తగా దర్శకుడి వేట మొదలైంది. కానీ తమిళంలో రజినీ, కమల్‌లకు సరైన ఆప్షన్లు కనిపించడం లేదు.
దీంతో తమిళంలో ఏ దర్శకుడి చేతిలో ఈ ప్రాజెక్టును పెట్టాలో తెలియక సతమతం అవుతున్నారు రజినీ, కమల్. ఓవైపు అక్కడ ఆప్షన్లు పరిశీలిస్తూనే టాలీవుడ్ వైపు కూడా వాళ్లిద్దరూ చూస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు దర్శకులు ఈ మధ్య తమిళ తారలతో బాగానే జట్టు కడుతున్నారు. విజయ్‌కి ‘వారిసు’ రూపంలో వంశీ పైడిపల్లి పెద్ద హిట్టిచ్చాడు. వెంకీ అట్లూరి.. ధనుష్‌కు ‘సార్’తో సక్సెస్ అందించాడు. ప్రస్తుతం అతను సూర్యతో సినిమా చేస్తున్నాడు. ఇక్కడ టాప్ స్టార్లను డీల్ చేయగల దర్శకులు చాలామందే ఉన్నారు. కాకపోతే అందరూ కొంచెం బిజీనే. కానీ రజినీతో సినిమా ఛాన్స్ అంటే చేస్తున్న చిత్రాన్ని పక్కన పెట్టి అయినా ఆ ప్రాజెక్టును టేకప్ చేసే అవకాశముంది. మరి ఆ ఛాన్స్ ఎవరందుకుంటారో?