మాస్ రాజా రవితేజ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా పూరి జగన్నాథ్ ‘ఇడియట్’ అయినప్పటికీ.. అంతకుముందు తనకు హీరోగా తొలి అవకాశం ఇచ్చింది మాత్రం కృష్ణవంశీనే. వీరి కలయికలో వచ్చిన ‘సింధూరం’ అనుకున్నంత విజయం సాధించకపోయినా కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఇందులో రవితేజ పెర్ఫామెన్సుకు కూడా మంచి పేరొచ్చింది. అంతకంటే ముందు కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నిన్నే పెళ్ళాడతా’లో ఒక చిన్న పాత్ర చేశాడు రవితేజ.
ఇక హీరోగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాక కూడా కృష్ణవంశీ దర్శకత్వంలో ‘ఖడ్గం’ లంటి కల్ట్ మూవీ చేశాడు. అందులో నటనకు కూడా మంచి పేరొచ్చింది. వీళ్లిద్దరూ 90వ దశకంలోనే మంచి స్నేహితులు. కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు రవితేజ. ఐతే రవితేజకు, కృష్ణవంశీకి ఎక్కడ చెడిందో కానీ..చాలా ఏళ్ల నుంచి ఇద్దరి మధ్య మ ాటలు లేవని తెలుస్తోంది. రవితేజ ఇప్పటికీ కృష్ణవంశీ గురించి ఇంటర్వ్యూల్లో మామాలుగానే మాట్లాడతాడు.
ఇటీవల ‘మాస్ జాతర’కు సంబంధించి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కూడా కృష్ణవంశీ గురించి పాజిటివ్‌గానే మాట్లాడాడు. కృష్ణవంశీ తనను ఏరా అనే పిలిచేవాడని చెప్పాడు. కానీ కృష్ణవంశీ మాత్రం రవితేజ ఊసు ఎత్తడానికి అస్సలు ఇష్టపడట్లేదు. కృష్ణవంశీకి సంబంధించిన పలు ఇంటర్వ్యూలను గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది. రవితేజ, లేదా తన సినిమాల ప్రస్తావన వస్తే.. నెక్స్ క్వశ్చన్ అనడం.. దాని గురించి మాట్లాడను అని చెప్పడం, ఏమో తెలీదు అనడం లాంటివి చేశాడు.
మాస్ జాతర ఇంటర్వ్యూలో కృష్ణవంశీ గురించి రవితేజ మాట్లాడిన వీడియోల కింద.. రవితేజ విషయమై పలు ఇంటర్వ్యూల్లో కృష్ణవంశీ అవాయిడ్ చేసిన వీడియో కనిపిస్తోంది. అసలు ఇద్దరికీ మధ్య ఏం జరిగింది.. కృష్ణవంశీ ఎందుకు హర్టయ్యాడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కృష్ణవంశీ బ్యాడ్ ఫేజ్‌లో ఉండగా సినిమా చేద్దామంటే రవితేజ ఒప్పుకోలేదా.. లేదా మాట ఇచ్చి తప్పాడా.. లేక ఇద్దరి మధ్య ఇంకేదైనా గొడవ జరిగిందా అన్నది జనాలకు అర్థం కావడం లేదు. మరి ఈ ప్రశ్నలకు ఎప్పుడు జవాబు దొరుకుతుందో మరి.