hyderabadupdates.com movies రవితేజ బయోపిక్ చేయాలనుకుని..

రవితేజ బయోపిక్ చేయాలనుకుని..

‘మహానటి’ సినిమా అద్భుత విజయాన్నందుకున్నాక తెలుగులో ఉన్న లెజెండరీ నటీనటులందరి అభిమానులకూ తమ అభిమాన తారల బయోపిక్స్ తెరపై చూసుకోవాలని అనిపించే ఉంటుంది. నందమూరి తారక రామారావు జీవిత కథను తెరపైకి తీసుకొచ్చారు కానీ.. దానికి సరైన టైమింగ్ కుదరకపోవడం వల్లో, అందులో చూపించిన అంశాలు సెలక్టివ్‌గా ఉండడం వల్లో అది ఆడలేదు. ఏఎన్నార్ బయోపిక్ గురించి నాగ్ ఆలోచించారు కానీ ఎందుకో అది కుదరలేదు. 

ఐతే ఇలా జీవించి లేని దిగ్గజాల మీద సినిమాలు తీయడానికే ఎక్కువమంది ఆలోచిస్తారు కానీ.. మన మధ్యే ఉన్న ఒక ఇన్‌స్పైరింగ్ ఆర్టిస్టు మీద సినిమా తీసేద్దాం అనుకున్నాడట యువ కథానాయకుడు సిద్దు జొన్నలగడ్డ. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగు పెట్టి.. మొదట్లో చిన్న చిన్న వేషాలు వేసి.. ఆపై హీరో అవతారం ఎత్తి.. కొన్నేళ్ల కష్టం తర్వాత స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ బయోపిక్‌ను సిద్ధు చేయాలనుకున్నాడట. మాస్ రాజాతో కలిసి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు.. ఆయన ముందే ఈ విషయాన్ని వెల్లడించాడు.

‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో బ్రేక్ అందుకున్నాక.. రవితేజ బయోపిక్ చేద్దామని సీరియస్‌గా రంగంలోకి దిగాడట సిద్ధు. కొన్ని రోజులు రీసెర్చ్ కూడా చేశాడట. కానీ తర్వాత ఏవో కారణాలతో ఆ సినిమా ప్రయత్నాన్ని విరమించుకున్నాడట. ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయిన రవితేజ.. తాను కూడా ఒక నటుడి బయోపిక్ చేద్దామని గతంలో అనుకున్నట్లు వెల్లడించాడు. కానీ ఆ నటుడెవరో చెప్పలేదు.

ఎవరి బయోపిక్స్ తీసినా.. అందులో పాజిటివ్ కోణాలను మాత్రమే చూపించడం కరెక్ట్ కాదని.. వారి జీవితాల్లోని ప్రతికూల విషయాలను కూడా తెరపైకి తీసుకురావాలని.. అప్పుడే ఆ బయోపిక్‌కు న్యాయం జరుగుతుందని మాస్ రాజా అభిప్రాయపడ్డాడు. రవితేజ కొత్త చిత్రం ‘మాస్ జాతర’ ఈ నెల 31న విడుదల కానుండగా.. సిద్ధు మూవీ ‘తెలుసు కదా’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు హీరోలు తమ చిత్రాలను ప్రమోట్ చేయడం కోసం ఉమ్మడి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Related Post