ఈ మధ్యే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తెలుగులో తెరకెక్కనున్న రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది. ముందుగా ‘స్పిరిట్’కు దూరమైన ఆమె.. తర్వాత తాను కీలక పాత్ర పోషించిన ‘కల్కి’ సినిమాకు కొనసాగింపుగా రావాల్సిన ‘కల్కి-2’ నుంచి కూడా వైదొలిగింది. అందుకు ప్రధాన కారణం.. వర్కింగ్ అవర్స్ విషయంలో షరతులు పెట్టడం.. తన జంబో స్టాఫ్‌కు వసతి సహా అన్నీ సమకూర్చాలని డిమాండ్ పెట్టడం.. దీంతో పాటు పారితోషకంలో పెంపు కోరడం.
ఆమె డిమాండ్లను తట్టుకోలేక ఆయా చిత్ర బృందాలు ఆమెకు టాటా చెప్పేశాయి. ఐతే వర్కింగ్ అవర్స్ గురించి షరతులు పెట్టడం నిజమే అంటూ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది దీపిక. మిగతా విషయాల గురించి మాత్రం ఆమె ఏమీ మాట్లాడలేదు. బాలీవుడ్ హీరోయిన్లు ఇలా ఉంటే.. హిందీలోనూ సినిమాలు చేస్తూ.. దక్షిణాదిన కూడా బిజీగా ఉంటూ రష్మిక మందన్నా నిర్మాతలకు ఎంతగా సహకరిస్తోందో చెప్పడానికి ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ మేకర్స్‌తో ఆమె వ్యవహరించిన తీరే ఉదాహరణ.
‘ది గర్ల్ ఫ్రెండ్’ రష్మిక చేస్తున్న మిగతా చిత్రాల మాదిరి భారీ సినిమా కాదు. పరిమిత బడ్జెట్లో ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ తీశారు నిర్మాతలు. ఐతే వాళ్లు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ చిత్రానికి ముందు ఎలాంటి పారితోషకం తీసుకోలేదట రష్మిక. ముందు బడ్జెట్‌ను సినిమాకు ఖర్చు పెట్టమని సూచించిన రష్మిక.. తనకు రావాల్సింది విడుదల తర్వాత చూసుకుందామని చెప్పిందట. కథ మీద ఆమె చూపించిన నమ్మకానికి ఇది నిదర్శనమని.. ఆమె ఇచ్చిన సపోర్ట్ వల్లే సినిమాను ఇంత బాగా తీయగలిగామని నిర్మాతల్లో ఒకరైన ధీరజ్ మొగిలినేని చెప్పారు.
పారితోషకం అనే కాక మిగతా విషయాల్లో రష్మిక కమిట్మెంట్ గురించి చెబుతూ.. ‘‘ఓవైపు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ రష్మిక మా సినిమా కోసం డేట్లు కేటాయించారు. మా సినిమా వల్ల ఆమె రెండు మూడు నెలల పాటు సరిగా నిద్ర కూడా పోలేదు. రాత్రి రెండు గంటల వరకు పుష్ప-2 షూటింగ్‌లో ఉండి.. ఉదయం 7 గంటలకు మా సెట్లోకి మేకప్‌తో అడుగు పెట్టేవారు. ఫారిన్లో వేరే సినిమా షూట్లో పాల్గొని తెల్లవారుజామున 4 గంటలకు ఎయిర్‌పోర్ట్‌లో దిగి.. 8 గంటలకు మా సినిమా షూట్‌కు వచ్చేసేవారు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ కోసం ఆమె అంత కష్టపడ్డారు’’ అని ధీరజ్ తెలిపాడు.