వరుసగా మాస్ సినిమాలు చేసి కొంచెం మొహం మొత్తించేసిన యువ కథానాయకుడు రామ్.. ఇప్పుడు రూటు మార్చాడు. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ లాంటి వెరైటీ మూవీతో అతను ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది ఒక స్టార్ హీరోకు వీరాభిమాని అయిన కుర్రాడి కథ. ‘బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారీ సినిమాకు. ఈ చిత్రంలో స్టార్ హీరోగా ఉపేంద్ర నటిస్తున్నాడు. కానీ కథంతా ఆ హీరో అభిమాని అయిన రామ్ చుట్టూ తిరుగుతుంది.
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని రూపొందించాడు. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని నవంబరు 28న రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా రిలీజ్‌కు ఒక రోజు ముందే యుఎస్‌లో ప్రిమియర్స్ పడతాయి. భారత కాలమానం ప్రకారం చూస్తే.. రిలీజ్ రోజుకు ముందు అర్ధరాత్రి ఈ షోలు మొదలవుతాయి.
ఐతే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీం.. రెండు రోజుల ముందే యుఎస్ ప్రిమియర్స్ ప్లాన్ చేసుకుంది. అంటే ఇండియన్ టైం ప్రకారం బుధవారం అర్ధరాత్రి నుంచే షోలు మొదలైపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కంటే ఒక రోజు ముందే టాక్ బయటికి వచ్చేస్తుంది. ఇలా ముందే యుఎస్‌లో ప్రిమియర్స్ వేయడంలో రిస్క్ కూడా ఉంది.
గతంలో ‘వీర భోగ వసంత రాయలు’ అనే సినిమాకు మూడు రోజుల ముందు ప్రిమియర్స్ వేశారు. దానికి బ్యాడ్ టాక్ వచ్చి సినిమాకు బాగా డ్యామేజ్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌కు ముందే సినిమా డిజాస్టర్ అయిపోయింది. ఆ అనుభవం గురించి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీంకు తెలిసే ఉండొచ్చు. అయినా సినిమా మీద నమ్మకంతో ధైర్యం చేస్తోంది. హీరో రామ్ స్వయంగా యుఎస్‌కు వెళ్లి ప్రిమియర్స్ నుంచి మూణ్నాలుగు రోజుల పాటు సినిమాను ప్రమోట్ చేయబోతున్నాడు. ఇది తన కాన్ఫిడెన్స్‌కు నిదర్శనం. మరి రామ్ అండ్ కో నమ్మకాన్ని నిలబెట్టేలా ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంటుందేమో చూడాలి.