బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న చిత్త శుద్ధి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల ముసుగులో రాజకీయం చేస్తున్నారని, బీసీలకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాజా గా బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ .కృష్ణయ్య నేతృత్వంలో బీసీ జేఏసీ నాయకులు కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నిర్వహించతలపెట్టిన బంద్, నిరసనలకు బీఆర్ ఎస్ పార్టీ మద్దతు కోరారు. ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోరుతూ ధర్నాలు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తమ పార్టీ ఎప్పుడూ బీసీలకు అనుకూలమేనని చెప్పారు. బీసీలకు మద్దతుగా అనేక పథకాలు కూడా తీసుకువచ్చామన్నారు. బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నామని ఈ ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చినప్పుడు అసెంబ్లీలో తాము కూడా ముందు ఆహ్వానించామని.. అదేవిధంగా మద్దతు కూడా తెలిపామని అన్నారు. కానీ.. ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోందని, బీసీలకు చట్టబద్ధంగారిజర్వేషన్ కల్పించేందుకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అందుకే బీసీలకు రిజర్వేషన్ అంశం పెండింగులో పడిపోయిందన్నారు.
“మీరు రాష్ట్రంలో నిరసన పెడతారో.. కేంద్రంలో పెడతారో .. పెట్టండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాం. నిరసన, బంద్ ఏదైనా సరే.. బీసీ బిడ్డల రిజర్వేషన్ దక్కించుకునేందుకు ఏం చేసినా మేం ముందుంటాం.“ అని కేటీఆర్.. ఆర్. కృష్ణయ్యకు హామీ ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటే.. చిటికెలో పని అని.. చాయ్ తాగినంత సేపు కూడా పట్టదని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ, వారికి చిత్తశుద్ధి లేనందుకే ఇది అలా ఉండిపోయిందన్నారు. బీసీ బిడ్డలు ఈ విషయాన్ని తెలుసుకుని.. ఆయా పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు.
ఇక, పార్టీ సంపూర్ణంగా బీసీ జేఏసీ నిరసనకు, బంద్‌కు కూడా మద్దతు ఇస్తుందని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొంటారని కేటీఆర్ చెప్పారు. పార్లమెంటులో బీసీల కోసం బిల్లు పెడితే.. మొదట ఓటేసేది.. మాట్లాడేది కూడా బీఆర్ఎస్ ఎంపీలేనని(రాజ్యసభలో మాత్రమే బీఆర్ ఎస్‌కు సభ్యులు ఉన్నారు.) కేటీఆర్ చెప్పారు. అలాకాదు.. ప్రధాని మోడీ దగ్గరకు వెళ్తామంటే.. తాము కూడా వస్తామన్నారు. ఆయన దగ్గరే ఈ పంచాయతీ తేల్చుకుందామని వ్యాఖ్యానించారు. మోడీ కూడా ఓబీసీ వ్యక్తే.. ఆయన బీసీల సమస్యలు అర్థం చేసుకోవాలి.. అని కేటీఆర్ అన్నారు.