వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కోటి సంతకాల సేకరణ చేసి, వాటిని గవర్నర్ కు సమర్పించి పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలను అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.
దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, పీపీపీ విధానంపై స్పష్టత ఇచ్చారు. పీపీపీ ద్వారా మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. కొందరు మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారని, అది పూర్తిగా రాజకీయ విమర్శ మాత్రమేనని అన్నారు. పీపీపీ విధానంలో నిర్మించినా అవి ప్రభుత్వ మెడికల్ కాలేజీల పేరుతోనే నడుస్తాయని, నిబంధనలన్నీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు.
జగన్ హయాంలో ప్రజాధనాన్ని భారీగా వృథా చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఆ డబ్బు సక్రమంగా ఉపయోగించి ఉంటే, ఇప్పుడు పీపీపీకి వెళ్లాల్సిన అవసరమే ఉండేదని అన్నారు. ముఖ్యంగా విశాఖ రుషికొండపై 550 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్యాలెస్ నిర్మించారని విమర్శించారు. ఆ మొత్తంతో రెండు నుంచి మూడు మెడికల్ కాలేజీలు నిర్మించవచ్చని తెలిపారు. అందుకే పీపీపీ అవసరం వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం రుషికొండ ప్యాలెస్ తెల్ల ఏనుగులా మారిందని వ్యాఖ్యానించారు.
పీపీపీ విధానంతో ప్రజలకు మేలు జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయా మెడికల్ కాలేజీలలో 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు అందుతాయని, సీట్ల సంఖ్య కూడా పెరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ విధానంలో ప్రాజెక్టులు చేపడుతోందని గుర్తు చేశారు.
విమర్శలకు భయపడాల్సిన అవసరం లేదని, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ బాధ్యత అధికారులు కూడా తీసుకోవాలని, తమ స్థాయిలో ప్రజలకు స్పష్టంగా వివరించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.